అక్షరటుడే వెబ్డెస్క్: Bhai Dooj Festival | భారతీయ సంస్కృతిలో బంధాలకు, సాంప్రదాయాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలను చాటిచెప్పే పండుగల్లో ‘భగినీ హస్త భోజనం’ అత్యంత విశిష్టమైనది. ఐదు రోజుల పాటు వైభవంగా సాగే దీపావళి ( Diwali )ఉత్సవాల్లో ఆఖరిది ఈ వేడుక. కార్తీక మాసంలో వచ్చే కార్తీక శుద్ధ విదియ తిథిని ‘యమ ద్వితీయ’ లేదా ‘భగినీ హస్త భోజనం’ (భాయ్ దూజ్) అని పిలుస్తారు. ఈ ఏడాది నవంబర్ 11న యమ ద్వితీయ రానుంది. ఈ రోజున సోదరులు తమ సోదరీమణుల ఇంటికి వెళ్లి వారి చేతి వంటను ఆప్యాయంగా భోజనంగా స్వీకరిస్తారు.
Bhai Dooj Festival | పవిత్ర పురాణ గాథ..
ఈ ఆచారం వెనుక ఒక పవిత్రమైన పురాణ కథ ఉంది. యమధర్మరాజు, యమునా దేవి ఇద్దరూ అన్నాచెల్లెళ్లు. యమునా దేవి ఎంతో కాలంగా తన అన్నను ఇంటికి వచ్చి భోజనం చేయాలని కోరేది. అయితే నరకలోకాధిపతిగా నిరంతరం విధుల్లో బిజీగా ఉండటం వల్ల యముడు వెళ్లలేకపోయేవాడు. చివరకు కార్తీక శుద్ధ ద్వితీయ నాడు అనుకోకుండా చెల్లెలి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో యమునా దేవి అమితమైన భక్తిశ్రద్ధలతో స్వయంగా రకరకాల వంటకాలు చేసి అన్నకు వడ్డించింది.
Bhai Dooj Festival | చెల్లెలి నిస్వార్థ కోరిక..
చెల్లెలి అపారమైన ప్రేమకు మురిసిపోయిన యమధర్మరాజు ఏదైనా వరం కోరుకోమనగా.. యమునా దేవి సమస్త మానవాళి శ్రేయస్సును కోరుకుంటూ ఒక వరం అడిగింది. “కార్తీక శుద్ధ ద్వితీయ రోజున భూలోకంలో ఏ సోదరుడైతే తన అక్క లేదా చెల్లెలి ఇంటికి వెళ్లి భోజనం చేస్తాడో, అతనికి యమభయం ఉండకూడదు. సకల ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలి” అని కోరింది. దీనికి యముడు సంతోషంగా వరమిచ్చాడు. అంతేకాకుండా, ఆ ఒక్క రోజు నరకంలో ఉన్న ఖైదీలకు కూడా విముక్తి కల్పించి, తమ సోదరీమణుల ఇళ్లకు వెళ్లి భోజనం చేసి రావాలని ఆజ్ఞాపించాడని పురాణాలు చెబుతున్నాయి.
Bhai Dooj Festival | సోదరులు ఏం చేయాలి?
యమ ద్వితీయ రోజున పురుషులు తమ సొంత ఇంట్లో కాకుండా అక్క లేదా చెల్లెలి ఇంటికి వెళ్లి భోజనం చేయడం అత్యంత శ్రేయస్కరం. సోదరి ఇంట్లో భోజనం స్వీకరించి, వారి దీవెనలు తీసుకోవడం వల్ల జీవితంలో సమస్త శుభాలు, విజయాలు కలుగుతాయి.
అక్కాచెల్లెళ్లు లేనివారు ఏమి చేయాలి?
సొంత అక్కాచెల్లెళ్లు లేనివారు వరసకు సోదరి అయ్యే వారి ఇంటికి వెళ్లి భోజనం చేయవచ్చు. లేదా ఎవరినైనా మనస్ఫూర్తిగా సోదరిగా భావించి వారి ఇంట్లోనైనా స్వీకరించవచ్చు. ఎవరి ఇంట్లోనూ భోజనం చేసే అవకాశం లేనివారు నదీ తీరాలకు వెళ్లి భోజనం చేయవచ్చని పండితులు వివరిస్తున్నారు.
Bhai Dooj Festival | తిలకం, హారతి విశిష్టత..
ఈ పండుగ రోజున సోదరి తన సోదరుడి నుదిటిపై తిలకం దిద్ది, మంగళ హారతి ఇస్తుంది. తిలకం శుభానికి చిహ్నం కాగా, తన అన్న లేదా తమ్ముడు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని సోదరి ప్రార్థిస్తుంది. పండితుల ప్రకారం.. మధ్యాహ్నం 1:13 గంటల నుంచి 3:28 గంటల మధ్య సోదరుడికి తిలకం దిద్దడం అత్యంత శుభప్రదం.
ఇది కూడా చదవండి: Amrad Fire Accident | అమ్రాద్లో అగ్నిప్రమాదం.. స్పందించిన అగ్నిమాపక శాఖ