అక్షరటుడే వెబ్‌డెస్క్: Cancer Medicine Prices | క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న రోగులకు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ప్రాణాంతక క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే 137 రకాల అత్యంత కీలకమైన, ఖరీదైన ఔషధాల ధరలను ఏకంగా 96.45 శాతం వరకు తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) జారీ చేసిన ఈ నూతన ధరలు సోమవారం నుంచే అమలులోకి వచ్చాయి.
Cancer Medicine Prices | రూ.3,540 కోట్ల ఆర్థిక భారం ..
ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగులకు ఏటా దాదాపు రూ.3,540 కోట్ల మేర ఆర్థిక భారం తగ్గనుంది. తాజా ధరల సవరణలో భాగంగా మొత్తం 534 రకాల ఔషధాల ధరలు తగ్గగా, అందులో పేటెంటెడ్, కాంబినేషన్లతో కూడిన 137 షెడ్యూల్డ్ క్యాన్సర్ మందులు ఉన్నాయి.
Cancer Medicine Prices | 30 శాతం ట్రేడ్ మార్జిన్..
క్యాన్సర్ మందుల విక్రయాల్లో డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లు సాగించే అధిక లాభార్జనకు చెక్ పెడుతూ NPPA స్పష్టమైన నిబంధనలు జారీ చేసింది. తయారీదారులు డిస్ట్రిబ్యూటర్లకు విక్రయించే అసలు ధరకు గరిష్ఠంగా 30 శాతం ట్రేడ్ మార్జిన్, వర్తించే జీఎస్టీ (GST) మాత్రమే కలిపి తుది ఎంఆర్‌పి (MRP) ని నిర్ణయించాలి.
Cancer Medicine Prices | తగ్గిన ధరల లెక్క..
ఉదాహరణకు ఒక మందు తయారీ ధర రూ.70 ఉండి, మార్కెట్‌లో దాని పాత ఎంఆర్‌పి రూ.300గా ఉంటే.. తాజా నిబంధనల ప్రకారం పన్నులతో కలిపి దాని ధర ఏకంగా రూ.100 స్థాయికి దిగివస్తుంది. కొత్తగా లెక్కించిన ధర పాత ఎంఆర్‌పి కంటే తక్కువగా ఉంటే తప్పనిసరిగా తగ్గించిన రేటుకే విక్రయించాలి.
Cancer Medicine Prices | ‘లైఫ్ సేవింగ్’ డ్రగ్స్..
వివిధ రకాల తీవ్రమైన క్యాన్సర్లకు చికిత్స అందించే అత్యంత ఖరీదైన, పేటెంటెడ్ ఔషధాలను కూడా ఈ ధరల తగ్గింపు పరిధిలోకి తీసుకొచ్చారు. పెంబ్రోలిజుమాబ్ (Pembrolizumab), నివోలుమాబ్ (Nivolumab), ఒసిమెర్టినిబ్ (Osimertinib), పాల్బోసిక్లిబ్ (Palbociclib), అబెమాసిక్లిబ్ (Abemaciclib) వంటి కీలక మందులు ఇందులో ఉన్నాయి. ఈ ఔషధాలకు సంబంధించిన అన్ని వేరియంట్లు, డోసేజ్‌లు, కాంబినేషన్లకు ఈ కొత్త రేట్లు వర్తిస్తాయి.
ఫార్మా సహీ దామ్ యాప్ ద్వారా కొత్త రేట్ల తనిఖీ..
మందుల కొనుగోలులో వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు కేంద్రం మార్గదర్శకాలను సూచించింది. రోగులు లేదా వారి బంధువులు తమ మొబైల్‌లో ‘ఫార్మా సహీ దామ్’ (Pharma Sahi Daam) అధికారిక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, మందుల కొత్త MRPని నేరుగా సులభంగా చెక్ చేసుకోవచ్చు.
Cancer Medicine Prices | ఫిర్యాదు చేసే విధానం..
ఒకవేళ మెడికల్ షాపుల నిర్వాహకులు లేదా రిటైలర్లు తగ్గించిన ధరల ప్రయోజనాన్ని రోగులకు ఇవ్వకుండా, పాత ధరలకే విక్రయిస్తూ అధిక డబ్బులు వసూలు చేస్తే వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారులు నేరుగా 1800-111-255 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయవచ్చని అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Amrad Fire Accident | అమ్రాద్‌లో అగ్నిప్రమాదం.. స్పందించిన అగ్నిమాపక శాఖ