Panchayat Funds Scam | పంచాయతీ నిధుల్లో గోల్​మాల్.. సర్పంచ్​లలో గుబులు

గ్రామ పంచాయతీలకు వస్తున్న నిధుల్లో భారీ గోల్​మాల్ జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Panchayat Funds Scam | గ్రామ పంచాయతీలకు వస్తున్న నిధుల్లో భారీ గోల్​మాల్ జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధి పనుల పేరిట విడుదలవుతున్న నిధులను అభివృద్ధికి ఖర్చు చేయకుండా సొంత వారి ఖాతాలకు మళ్లిస్తున్న వైనం జిల్లాలో కలకలం రేపుతోంది. ఒకే పనికి రెండు మూడేసి బిల్లులు పెట్టి నిధులు కాజేస్తున్న తీరుపై గ్రామాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Panchayat Funds Scam | ప్రస్తుతం హాట్​టాపిక్​గా..

గత, ప్రస్తుత పంచాయతీ పాలకవర్గాల్లో నెలకొన్న నిధుల గోల్​మాల్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్​ గా మారుతోంది. గత పాలకవర్గాల్లో అనేకమంది సర్పంచులకు బిల్లులు రావాల్సి ఉండగా, మరికొందరు పనుల పేరిట నిధులను సొంతానికి వాడుకుంటున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ తరహా ప్రచారం ఇటీవల ఎక్కువ కావడంతో పాటు పలువురు గ్రామాల ప్రజలు అధికారులకు ఫిర్యాదులు చేస్తుండటంతో విచారణకు ఆదేశిస్తున్నారు.

Panchayat Funds Scam | సొంత వారి ఖాతాలకు నిధులు

ఉమ్మడి మాచారెడ్డి మండలం (Machareddy Mandal)లోని ఓ గ్రామానికి చెందిన సర్పంచ్ నిధుల దుర్వినియోగం వ్యవహారంలో తాజాగా అరెస్ట్ అయ్యారు. గ్రామస్తులు అధికారులకు, పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో జిల్లా కలెక్టర్ ఆరుగురు జిల్లాస్థాయి అధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ విచారణలో నిధులు దుర్వినియోగమైనట్లు నిర్ధారణ కావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. పంచాయతీ ఖాతా నుంచి నిధులు నేరుగా సర్పంచ్ కు సన్నిహితులుగా చెబుతున్న వ్యక్తుల ఖాతాలకు, కాంట్రాక్టర్ల పేరిట బదిలీ అయినట్లు విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది. అసలు పనులు జరగకుండానే నిధులు చేతులు మారినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

Panchayat Funds Scam | ఒక పనికి రెండు బిల్లులు

సదరు సర్పంచ్ ఎంపీటీసీగా ఉన్న సమయంలో నిధులను కాంట్రాక్టర్ పేరిట బదిలీ చేసి వాడుకున్నట్లు విచారణలో తేలింది. ముఖ్యంగా డ్రైనేజీ పనుల్లో అవినీతి ఆరోపణలు రుజువు కాగా, ఒకే పనికి రెండుసార్లు బిల్లులు పెట్టి నిధులు పొందినట్లు వెల్లడైంది. ఒకే డ్రైనేజీ పనికి వేర్వేరు తేదీల్లో, వేర్వేరు బిల్లులతో నిధులు డ్రా చేసినట్లు రికార్డుల పరిశీలనలో బయటపడినట్లు సమాచారం. పనుల కొలతలు, అంచనాల్లోనూ తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సదరు సర్పంచ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు సర్పంచ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్​తో ఉమ్మడి మాచారెడ్డి మండలంలో కలకలం రేగింది. గత కొద్దిరోజులుగా సర్పంచ్ తీరుపై గ్రామంలో వివాదం కొనసాగుతుండగా, చివరికి అరెస్ట్ వరకు వ్యవహారం వెళ్లిందన్న చర్చ సాగుతోంది.

Panchayat Funds Scam | మరొక సర్పంచుపై ఫిర్యాదుకు సన్నద్ధం

ఈ అరెస్ట్​తో మరో గ్రామంలోనూ ఇదే తరహా వ్యవహారం బయటపడుతోంది. అక్కడి సర్పంచ్ పైనా నిధులను సొంత వారి పేరిట మళ్లించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామస్తులు ఆధారాలను సేకరించి అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ గ్రామంలోనూ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనన్న చర్చ సాగుతోంది. అభివృద్ధి పనులు జరగకపోయినా బిల్లులు మాత్రం పూర్తయినట్లు చూపుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఓ గ్రామ పంచాయతీ నిధుల వ్యవహారంలో సర్పంచ్, ఉప సర్పంచ్​లకు సెల్ఫ్ చెక్కులు రాసుకున్నట్టుగా ప్రచారం సాగింది. ఈ చెక్కులకు సంబంధించిన పనుల ఎంబీలు తయారీకి గతంలో అక్కడ పనిచేసిన పంచాయతీ కార్యదర్శులు సహకరించారన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ కాగా సర్పంచ్ చెక్ పవర్ రద్దయినట్టు ప్రచారం సాగుతోంది. రేపోమాపో పంచాయతీ కార్యదర్శులపై వేటుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం.

Panchayat Funds Scam | మిగతా పంచాయతీల్లో భయం..భయం..

జిల్లాలో జరుగుతున్న పరిణామాలు నిధుల గోల్​మాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీ పాలకవర్గాల్లో ఆందోళన మొదలైనట్టుగా తెలుస్తోంది. ఏకంగా సర్పంచ్​ను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడంతో పాటు పంచాయతీ కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలకు అధికారులు సిద్ధం అవుతున్నారన్న ప్రచారం ఇటు సర్పంచుల్లోనూ, అటు పంచాయతీ కార్యదర్శుల్లోనూ భయం పుట్టిస్తోంది. ఈ తరహా ఫిర్యాదులు గ్రామస్తుల ద్వారా అధికారుల వద్దకు వెళ్లకుండా పకడ్బందీ ప్రణాళికలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి..: Land Resurvey | భూముల రీసర్వేను పారదర్శకంగా వేగవంతంగా పూర్తిచేయాలి..: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *