అక్షరటుడే వెబ్‌డెస్క్: SAP Job Cuts | ఏఐ ఆధారిత సేవల వైపు మళ్లుతున్న నేపథ్యంలో ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఎస్ఏపీ (SAP) 10 వేలకు పైగా ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. ఈ నిర్ణయం అమలైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎస్ఏపీ ఉద్యోగుల్లో సుమారు 9 శాతం మందిపై ప్రభావం పడే అవకాశం ఉంది. టెక్ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరుగుతున్న కొద్దీ పలు సంస్థలు తమ పని విధానాలు, సిబ్బంది సంఖ్యను పునర్వ్యవస్థీకరిస్తున్న క్రమంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
SAP Job Cuts | వ్యాపార వ్యూహంలో మార్పులు..
ఏఐ ( AI )ఆధారిత పరిష్కారాలకు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో ఉంచుకుని ఎస్ఏపీ తన వ్యాపార వ్యూహాన్ని మార్చుకుంటోంది. ప్రధానంగా ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ఇంజినీరింగ్, సేల్స్ విభాగాల్లో పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిబ్బంది సంఖ్య తగ్గింపునకు ఏయే విభాగాల్లో వీలుందో గుర్తించాలని ఇప్పటికే వివిధ విభాగాలకు సంస్థ సూచించినట్లు నివేదిక పేర్కొంది. అయితే ఉద్యోగాల కోతపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, కార్మిక సంఘాలతో సంప్రదింపుల అనంతరం సంఖ్యలో మార్పులు ఉండవచ్చని సమాచారం. వ్యాపార వ్యూహాలు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సంస్థాగత మార్పులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటామని ఎస్ఏపీ ప్రతినిధులు తెలిపారు.
SAP Job Cuts | గత పునర్వ్యవస్థీకరణ..
ఉద్యోగుల సంఖ్యను పునర్వ్యవస్థీకరించడం ఎస్ఏపీకి కొత్తేమీ కాదు. 2024లోనూ దాదాపు 10 వేల ఉద్యోగాలపై ప్రభావం చూపే రీస్ట్రక్చరింగ్ కార్యక్రమాన్ని సంస్థ ప్రకటించి, సుమారు 3 బిలియన్ యూరోలు వెచ్చించింది. అప్పట్లో స్వచ్ఛంద పదవీ విరమణలు, రీస్కిల్లింగ్ కార్యక్రమాల ద్వారా మార్పులు చేపట్టింది. ప్రస్తుతం ఎస్ఏపీలో ప్రపంచవ్యాప్తంగా 1.10 లక్షలకు పైగా ఉద్యోగులు ఉండగా, జర్మనీలో సిబ్బందికి 2028 వరకు ఉపాధి భరోసా అమల్లో ఉంది. సీఈఓ క్రిస్టియన్ క్లైన్ ఏఐ ఆధారిత వ్యూహంపై దృష్టి సారించగా, ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని తాను ఆశించడం లేదని సీఎఫ్ఓ డొమినిక్ అసామ్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఏఐ ప్రభావంతో టెక్ కంపెనీల్లో ఉద్యోగాల స్వరూపం మారుతున్న వేళ ఎస్ఏపీ నిర్ణయంపై టెక్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఇది కూడా చదవండి: TOMCOM Training | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ‘టామ్‌కామ్’ శిక్షణతో విదేశాల్లో కొలువులు