Isannapalli Kalabhairava | ఇసన్నపల్లి కాలభైరవ స్వామి ఉత్సవాలకు వేళాయే..

దక్షిణ కాశీగా కొలవబడుతున్న శ్రీ కాలభైరవ స్వామి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Isannapalli Kalabhairava | దక్షిణ కాశీగా కొలవబడుతున్న శ్రీ కాలభైరవ స్వామి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. కార్తీక మాసంలో ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగనున్న ఈ ఉత్సవాలను ఈసారి మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

Isannapalli Kalabhairava | ఇసన్నపల్లి(రామారెడ్డి) గ్రామంలో..

ఇసన్నపల్లి(రామారెడ్డి) గ్రామంలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానంలో స్వామివారి పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు డిసెంబర్ 2 వరకు ఘనంగా జరగనున్నాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి కమిటీ, గ్రామస్తులు కలిసి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాలభైరవ స్వామి అంటే చుట్టుపక్కల గ్రామాల్లోనే కాదు, ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లా (Kamareddy District)ల్లో ఎంతో ప్రసిద్ధి. స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ప్రతిఏటా స్వామివారి జన్మదినోత్సవాన్ని గ్రామస్తులు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఐదు రోజుల పాటు పంచాహ్నిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సిద్ధమైంది. శనివారం ఉదయం 6 గంటల నుంచి గణపతి పూజ, పుణ్యాహవాచనం, మూర్తి స్థాపన, కంకణధారణ, సంతతధారాభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

Isannapalli Kalabhairava | దక్షిణ కాశీగా ఖ్యాతి

ఇసన్నపల్లి(రామారెడ్డి)ని భక్తులు దక్షిణ కాశీగా భావిస్తారు. కాలభైరవ స్వామి దర్శనం కోసం ఏడాది పొడవునా భక్తులు వస్తూనే ఉంటారు. ముఖ్యంగా శని, మంగళవారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. గ్రహదోషాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు తొలగిపోతాయని, వ్యాపారంలో, వ్యవసాయంలో అభివృద్ధి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. మొక్కులు చెల్లించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయిస్తారు. కార్తీక మాసంలో జరిగే బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారిని దర్శించుకుంటే విశేష ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం.  ఉత్సవాలకు తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా డోలారోహణం, రథోత్సవం, దక్షయజ్ఞం, అగ్ని గుండములను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. గత ఏడాది కూడా లక్షలాది మంది భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఏడాది భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ కమిటీ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Isannapalli Kalabhairava | ఉత్సవాల వివరాలు ఇవే..

నవంబర్ 29 ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు. నవంబర్ 30 సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి భక్తుల సహకారంతో లక్ష దీపార్చన జరుగుతుంది. రాత్రి 8 గంటల నుంచి ఇసన్నపల్లి, రామారెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. డిసెంబర్ 1న ఉత్సవాల్లో అత్యంత కీలకమైన రోజు. ఉదయం 6 గంటలకు సంతతధారాభిషేకం సమాప్తి. ఉదయం 7.05 నుంచి 10.30 వరకు దేవస్థాన పర్యవేక్షణలో ధ్వజారోహణము, మహాపూజ, దక్షయజ్ఞ కార్యక్రమము జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి సింధూర పూజ. మధ్యాహ్నం 3 గంటలకు డోలారోహణం (తొలి జన్మదినోత్సవం), అన్నదానం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు బండ్ల ఊరేగింపు, రాత్రి 8 గంటల నుంచి భద్రకాళి పూజ. రాత్రి 9 గంటల నుంచి పల్లకీ సేవ అనంతరం తెల్లవారుజామున 3 గంటల నుంచి రథోత్సవం జరుగుతుంది. డిసెంబర్ 2న ఉదయం 6 గంటలకు దక్షయజ్ఞం (అగ్ని గుండముం) చేపట్టనున్నారు.

Isannapalli Kalabhairava | ఏర్పాట్లు పూర్తి..

ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు కావాల్సిన తాగునీరు, వసతి, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆలయ పరిసరాల్లో పారిశుధ్యం కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. భక్తులకు అన్నదానం నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. అత్యవసర సమయంలో వైద్య సదుపాయం అందుబాటులో ఉంచారు. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించారు. గ్రామంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఉంచనున్నారు.

ఇది కూడా చదవండి..: Election Literacy Clubs | వ్యాసరచన పోటీల్లో నందిపేట్​ విద్యార్థిని ప్రతిభ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *