అక్షరటుడే వెబ్‌డెస్క్:India MIRV Missile|భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరింది. అణ్వస్త్ర నిరోధక శక్తిని మరింత బలోపేతం చేస్తూ, ఒకే క్షిపణి ద్వారా ఏకకాలంలో వివిధ లక్ష్యాలను ఛేదించగల అత్యున్నత MIRV (Multiple Independently Targetable Re-entry Vehicle) సాంకేతికతను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ మైలురాయితో, ఈ స్థాయి అధునాతన బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం కలిగిన అగ్రదేశాల సరసన భారత్ చేరింది.
India MIRV Missile|ఒకే క్షిపణిలో ఉన్న బహుళ పేలోడ్‌లు..
ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. హిందూ మహాసముద్ర పరిధిలో వేర్వేరు భౌగోళిక ప్రాంతాల్లో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి ఖచ్చితత్వంతో ఛేదించింది. ఒకే క్షిపణిలో ఉన్న బహుళ పేలోడ్‌లు (యుద్ధ విమానాలు/బాంబులు) నిర్దేశిత లక్ష్యాల వైపు విడిపోయి విరుచుకుపడటంలో ఈ పరీక్ష పూర్తి విజయం సాధించిందని రక్షణ శాఖ వెల్లడించింది.
India MIRV Missile|అణు నిరోధక శక్తికి కొత్త ఊపిరి..
ప్రస్తుత ప్రాంతీయ భద్రతా సమీకరణాల నేపథ్యంలో, సుదూర ప్రాంతాల్లోని శత్రు స్థావరాలను ఏకకాలంలో దెబ్బతీయగల ఈ సామర్థ్యం భారత్‌కు వ్యూహాత్మక ఆధిక్యాన్ని ఇస్తుంది. క్షిపణి గమనాన్ని ప్రయోగం నుండి లక్ష్యాన్ని చేరే వరకు భూమి , నౌక ఆధారిత టెలిమెట్రీ, ట్రాకింగ్ నెట్‌వర్క్‌ల ద్వారా శాస్త్రవేత్తలు నిశితంగా పర్యవేక్షించారు. మిషన్ నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలను ఈ పరీక్ష అధిగమించినట్లు ఫ్లైట్ డేటా ధృవీకరించింది.
India MIRV Missile|స్వదేశీ పరిజ్ఞానంతో ‘DRDO’ అద్భుతం..
‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా రక్షణ పరిశోధన , అభివృద్ధి సంస్థ (DRDO) ఈ క్షిపణిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. దేశీయ రక్షణ పరిశ్రమల సహకారంతో రూపొందిన ఈ ప్రాజెక్టును డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు, భారత సైన్య ప్రతినిధులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ అద్భుత విజయంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలను, భారత సైన్యాన్ని అభినందించారు. పెరుగుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో ఈ క్షిపణి వ్యవస్థ దేశానికి రక్షణ కవచంలా మారుతుందని ఆయన కొనియాడారు.
ఇది కూడా చదవండి : Anil Ambani CBI|అనిల్ అంబానీకి షాక్.. ఏడీఏ గ్రూప్ కంపెనీలపై సీబీఐ సోదాలు

