Vijay Cabinet | తమిళనాడులో విజయ్ కొత్త రాజకీయ శకం.. కేబినేట్‌లో 29 ఏళ్ల యువ నటికి చోటు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijay Cabinet | తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పునకు నాంది పలుకుతూ టీవీకే అధినేత విజయ్ (Vijay) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే ప్రజాదరణ సంపాదించిన ఆయన.. ఇప్పుడు రాష్ట్ర పాలన బాధ్యతలను స్వీకరించారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్ తన తొలి మంత్రివర్గాన్ని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.ఈ కేబినెట్‌లో యువతకు, వివిధ రంగాల్లో నిపుణులుగా గుర్తింపు పొందిన వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రత్యేకంగా కనిపిస్తోంది. ముఖ్యంగా 29 ఏళ్ల నటి ఎస్‌.కీర్త‌న‌కు మంత్రివర్గంలో చోటు కల్పించడం హాట్ టాపిక్‌గా మారింది. శివకాశి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆమె.. విజయ్ కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు.

Vijay Cabinet | టీవీకే నేత‌ల ప్ర‌మాణ స్వీకారం..

సినీ రంగంలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తన (Keertana).. ఇప్పుడు రాజకీయాల్లో కూడా కీలక బాధ్యతలు చేపట్టబోతుండటంతో యువతలో ఆసక్తి పెరిగింది. మహిళలకు, యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తానన్న విజయ్ మాటలకు ఇది నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే టీవీకే పార్టీ ఆవిర్భావానికి ముందే విజయ్ ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడిగా పనిచేసిన ఎన్‌.ఆనంద్‌ N. Anandకు కూడా మంత్రివర్గంలో కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ఆనంద్.. విజయ్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.

Vijay Cabinet | అధవ్ అర్జున

బాస్కెట్‌బాల్ మాజీ క్రీడాకారుడు అధ‌వ్ అర్జున‌ (Aadhav Arjuna) కూడా ఈ కేబినెట్‌లో చోటు సంపాదించారు. గతంలో డీఎంకే ఎన్నికల వ్యూహాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన.. ఇప్పుడు విజయ్ టీమ్‌లో చేరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఆసక్తికరంగా మారింది. మాజీ ఐఆర్ఎస్ అధికారి కే.జీ. అరున్ రాజ్‌ (Dr. K. G. Arunraj)కు కూడా మంత్రి పదవి దక్కింది. పరిపాలనా అనుభవం ఉన్న వ్యక్తులను ప్రభుత్వంలో భాగం చేయాలన్న ఉద్దేశంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే దంత వైద్యుడిగా సేవలందించిన టీ.కే ప్ర‌భు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Vijay Cabinet | వీరికి కూడా..

ఐదు దశాబ్దాల పాటు అన్నాడీఎంకేలో కొనసాగిన సీనియర్ నేత సెంగొట్టియ‌న్ కు కూడా విజయ్ కేబినెట్‌లో చోటు దక్కింది. గతేడాది అన్నాడీఎంకేకు రాజీనామా చేసి విజయ్ పార్టీలో చేరిన ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.ఇక విజయ్‌కు సుదీర్ఘకాలంగా మేనేజర్‌గా వ్యవహరించిన అడ్వకేట్ పి. వెంకటరమణన్ కూడా ఇప్పుడు మంత్రివర్గంలో భాగమయ్యారు. అలాగే పార్టీ ఐటీ విభాగం డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్‌కు కూడా మంత్రి పదవి దక్కింది. విజయ్ ప్రకటించిన తొలి మంత్రివర్గ జాబితాలోని సభ్యులందరూ టీవీకే పార్టీకి చెందినవారే కావడం విశేషం. కాంగ్రెస్​, కమ్యూనిస్ట్ పార్టీలు, వీసీకే ఆయనకు మద్దతు తెలిపినప్పటికీ ఆ పార్టీ నేతలకు చోటు ఇవ్వకపోవడం గమనార్హం.

 

దీనిని కూడా చదవండి : Vijay Swearing-In | విజయ్​ ప్రమాణ స్వీకారం.. ప్రత్యేక ఆకర్షణగా త్రిష

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *