అక్షరటుడే వెబ్‌డెస్క్: Stalin Vijay Comments | తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి విజయ్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అసెంబ్లీలో సీఎం విజయ్ తనపై చేసిన MISA చట్టం, గత పరిణామాల ప్రస్తావనపై స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీని అనవసర వివాదాలకు వేదికగా మార్చొద్దని హితవు పలికారు. సోషల్ మీడియా రీల్స్, ప్రచారాలతో పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని, ‘‘మీరు సినిమాల షూటింగ్‌లా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు’’ అంటూ సీఎం విజయ్‌పై స్టాలిన్ మండిపడ్డారు.
Stalin Vijay Comments | సినిమా షూటింగ్‌లా ప్రభుత్వం ..
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విడుదల చేసిన వీడియోలో సీఎం విజయ్‌ను ‘తంబి విజయ్’ (సోదరుడు విజయ్) అని సంబోధిస్తూ స్టాలిన్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీని రీల్స్ చేసే ప్రదేశంగా మార్చేశారని, తాము నిర్మించిన వంతెనలపై నిలబడి ఫొటోషూట్లు చేస్తూ పరిపాలనను సినిమా షూటింగ్‌లా నడిపిస్తున్నారని ఆరోపించారు. తమ పాలనా లోపాలను దాచేందుకే ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు ఉపయోగిస్తున్నారని అన్నారు. ఇటీవల అసెంబ్లీలో విజయ్ MISA చట్టాన్ని ప్రస్తావిస్తూ స్టాలిన్ గతాన్ని గుర్తుచేశారు. తాను చేసిన చేతి సంజ్ఞ ఉద్దేశపూర్వకంగా కాదని విజయ్ వివరణ ఇస్తూ.. 1976లో MISA కింద అరెస్టయిన సమయంలో స్టాలిన్ దవడకు తగిలిన గాయంతో దానిని పోల్చారు.
దీనిపై స్టాలిన్ స్పందిస్తూ.. 1976 ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేసుకున్నారు. మెరీనా బీచ్‌లో డీఎంకే భారీ సభ నిర్వహించిన తర్వాత, జనవరి 31న ప్రభుత్వం ప్రభుత్వాన్ని రద్దు చేసిందని చెప్పారు. తనను అరెస్టు చేయడానికి పోలీసులు గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి రాగా.. తాను ఎన్నికల ప్రచారం ముగించుకుని ఇంటికి వెళ్లిన తర్వాత తన తండ్రి కరుణానిధే స్వయంగా పోలీసులను పిలిచి అరెస్టు చేయమన్నారని తెలిపారు.
Stalin Vijay Comments | నిర్బంధానికి గురయ్యారని..
ఎమర్జెన్సీ సమయంలో తనతో పాటు మురసోలి మారన్, చిట్టిబాబు వంటి సీనియర్ నేతలు కూడా నిర్బంధానికి గురయ్యారని స్టాలిన్ తెలిపారు. జైలులో అపరిశుభ్రమైన గదుల్లో ఉంచుతూ, పోలీసులు, తోటి ఖైదీల చేతిలో తీవ్ర దాడులు ఎదుర్కొన్నామని చెప్పారు. ఆ సమయంలో తన దవడకు తగిలిన గాయాల గుర్తులు ఇప్పటికీ ఉన్నాయని, మాజీ మేయర్ చిట్టిబాబు జైలులో జరిగిన దాడుల వల్లే ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మీకు ఏమైనా అనుమానం ఉంటే నా పోరాట చరిత్రను చదవండి. అప్పుడు నిజం మీకు అర్థమవుతుంది’’ అని అన్నారు. డీఎంకే సిద్ధాంతాల కోసం తాము ఎన్నో ఇబ్బందులు పడ్డామని స్పష్టం చేశారు.
Stalin Vijay Comments | రాజకీయ కక్ష సాధింపులే..
విజయ్ ప్రస్తావించిన ప్రభుత్వ కమిషన్, కరుణానిధిపై వస్తున్న పాత ఆరోపణల గురించి మాట్లాడుతూ.. కమిషన్ ఏర్పడిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు మారాయని, నిజం ఉంటే ఎప్పుడో చర్యలు తీసుకునేవారని అన్నారు. రాజకీయ కక్షతోనే పాత అంశాలను మళ్లీ తెరపైకి తెస్తున్నారని విజయ్‌పై మండిపడ్డారు. డీఎంకే నేతలపై ఈడీ లేఖలను అసెంబ్లీలో ప్రస్తావించడాన్ని తప్పుబట్టిన ఆయన, కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రతీకారానికి వాడేస్తున్నారని ఆరోపించారు.
Stalin Vijay Comments | హుందాతనంగా మాట్లాడాలని ..
ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ్ తన ఇంటికి వచ్చిన విషయాన్ని గుర్తుచేసిన స్టాలిన్.. ఇప్పుడు ఆయన ఉన్న స్థానానికి తగినట్లుగా హుందాతనంగా మాట్లాడాలని సూచించారు. ‘‘ఒక ముఖ్యమంత్రి మాటల్లో, బాడీ లాంగ్వేజ్‌లో స్థాయికి తగిన హుందాతనం కనిపించాలి. మనం ప్రజలకు రోల్ మోడల్స్ అనే విషయాన్ని మర్చిపోవద్దు’’ అని హితవు పలికారు. అసెంబ్లీని ప్రజా సమస్యలు, చట్టవ్యవస్థ, రాష్ట్ర అభివృద్ధిపై చర్చించేందుకు ఉపయోగించాలని కోరారు.
“TN CM Vijay has turned the Assembly into a place for making reels and is running the administration like a cinema shoot.”
– Stalin pic.twitter.com/L342thHENL
— News Arena India (@NewsArenaIndia) September 10, 2026
ఇది కూడా చదవండి: Ponnam Prabhakar RTC | మహిళలకు రూ.12,000 కోట్లకు పైగా ఆదా.. మంత్రి పొన్నం ప్రభాకర్