అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Godavari Pushkaralu | జిల్లాలో గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి తెలిపారు. త్రివేణి సంగమమైన రెంజల్ మండలం కందకుర్తి, నవీపేట్లోని యంచ వద్ద కలెక్టర్ భవేష్ మిశ్రా (Collector Bhavesh Mishra)తో కలిసి ఆయన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
Godavari Pushkaralu | పుణ్యస్నానాల కోసం..
వచ్చే ఏడాది జూన్, జూలై మాసాలలో జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా పుణ్య స్నానాల కోసం జిల్లాలోని వివిధ పుష్కర క్షేత్రాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. పుష్కర ఘాట్ల వద్ద సదుపాయాల కల్పన కోసం అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. కందకుర్తి వద్ద నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో రూ. 6.05 కోట్ల అంచనా వ్యయంతో పుష్కర ఘాట్ నిర్మాణానికి, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో రూ.3.90 కోట్ల నిధులతో రోడ్ల నిర్మాణాలకు, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ. 5 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. యంచ వద్ద రూ. 2.15 కోట్ల నిధులతో పుష్కర ఘాట్, రూ.70 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు.
Godavari Pushkaralu | కుంభమేళా తరహాలో..
ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో అట్టహాసంగా నిర్వహించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. ఒక్క కందకుర్తి పుష్కర క్షేత్రం వద్దనే అన్ని శాఖల పనులను కలుపుకుని సుమారు రూ.30 కోట్లను వెచ్చిస్తున్నామని వివరించారు. భక్తుల రాకపోకలు, పార్కింగ్, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, వైద్య సేవలు, దుస్తులు మార్చుకునే గదులు తదితర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
Godavari Pushkaralu | నాణ్యతా ప్రమాణాలతో..
పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. పుష్కర ఘాట్ల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పుణ్య స్నానాల కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, బోధన్ ఆర్డీవో విజయ కుమారి, తహశీల్దార్లు శ్రవణ్, వెంకట రమణ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Dichpally Road Accident | జాతీయ రహదారిపై ఘెర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి