అక్షరటుడే వెబ్‌డెస్క్: Ponnam Prabhakar RTC | దేశవ్యాప్తంగా పేద, మధ్యతరగతి ప్రజలకు రైల్వేలు లైఫ్‌లైన్ అయితే, తెలంగాణ ప్రజలకు మాత్రం ఆర్టీసీయే ప్రధాన జీవనాడి అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శాసనసభలో ఆర్టీసీ పనితీరుపై జరిగిన చర్చలో భాగంగా ఆయన సభ్యులు అడిగిన ప్రశ్నలకు సుదీర్ఘంగా, వివరంగా సమాధానమిచ్చారు. రోజువారీగా సుమారు 30 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ 65 లక్షల మంది ప్రయాణికులను ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతోందని ఆయన పేర్కొన్నారు.
గత పదేళ్ల కాలంలో మునుపటి పాలకులు కొత్త బస్సులు కొనుగోలు చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం చేశారని మంత్రి మండిపడ్డారు. రిటైర్డ్ ఈడీని ఎండీగా నియమించి సంస్థను నష్టాల బాటలోకి నెట్టారని, అప్పట్లో కార్మికుల సమస్యలను కూడా పూర్తిగా పట్టించుకోలేదని విమర్శించారు.
Ponnam Prabhakar RTC | ఆర్టీసీకి పూర్వవైభవం..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న ‘మహాలక్ష్మి’ పథకాన్ని తెచ్చి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి తెలిపారు. ఈ పథకం మహిళల ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా ఆర్టీసీకి కొత్త జీవం పోసిందని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని మహిళలు 347.47 కోట్ల సార్లు ఉచితంగా ప్రయాణించి, ఏకంగా రూ.12,171 కోట్లు ఆదా చేసుకున్నారని వివరించారు. ఆసుపత్రులు, దేవాలయాలు, బంధువుల ఇళ్లకు వెళ్లడానికి, పిల్లల చదువులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వినతుల మేరకు కొత్త సర్వీసులు, అదనపు ట్రిప్పులు ప్రారంభించడంతో పాటు కరోనా సమయంలో నిలిచిపోయిన రూట్లను కూడా పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. నిరంతరం శ్రమిస్తున్న డ్రైవర్లు, కండక్టర్ల సేవలను సభ అభినందించాలని కోరారు.
Ponnam Prabhakar RTC | లాభాల బాటలో ఆర్టీసీ..
గతంలో ఆపరేషనల్ నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ ఇప్పుడు లాభాల బాటలో పయనిస్తోందని మంత్రి తెలిపారు. సంస్థను పటిష్టం చేసేందుకు ఇప్పటివరకు పాత బస్సుల స్థానంలో 2,932 కొత్త బస్సులను కొనుగోలు చేశామన్నారు. 15 సంవత్సరాలు దాటిన పాత బస్సులను తొలగిస్తూ, ఇప్పటికే 340 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చామని చెప్పారు. హైదరాబాద్‌లో ‘పీఎం ఈ-డ్రైవ్’ కింద 2,200 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తున్నామని తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసం ప్రీమియం, ఎలక్ట్రిక్ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఆదిలాబాద్‌లో ఎస్పీ సహకారంతో బస్సుల్లో సీసీ కెమెరాలు అమర్చామని, భవిష్యత్‌లో వీటిని అన్ని బస్సులకూ విస్తరిస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లో లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్లను అనుసంధానిస్తూ 370 కొత్త రూట్లలో బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు.
Ponnam Prabhakar RTC | డిపోల పెంపు..
రాష్ట్రంలో ఆర్టీసీ డిపోల సంఖ్యను 97 నుంచి 99కి పెంచామని, పెద్దపల్లి, ములుగులలో కొత్త డిపోలు ఏర్పాటు చేశామని మంత్రి పొన్నం వివరించారు. అవసరమైన మరిన్ని ప్రాంతాల్లోనూ కొత్త డిపోలు తెరుస్తామన్నారు. ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా సీఎస్‌ఆర్ నిధులతో బస్ స్టేషన్లలో వసతులు మెరుగుపరుస్తున్నామని, యాదాద్రి వెళ్లే భక్తుల కోసం వంగర వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సుల నిలుపుదలకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆర్టీసీ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఆయన.. గాజులరామారం, శంషాబాద్, ఫ్యూచర్ సిటీల్లో టెర్మినల్స్ కోసం స్థలాలు సేకరించినట్లు తెలిపారు.
Ponnam Prabhakar RTC | కార్మికుల సంక్షేమానికి పెద్దపీట..
గతంలో 60 రోజుల పాటు సాగిన కార్మికుల సమ్మెను కూడా పట్టించుకోని పాలకుల తీరుకు భిన్నంగా, తమ ప్రభుత్వం కార్మిక సమస్యలను పరిష్కరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ కుటుంబానికి ఉద్యోగంతో పాటు ఇల్లు అందిస్తున్నామని తెలిపారు. అప్పట్లో తొలగించిన 244 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకున్నామని, అంతేకాకుండా 1,430 మందికి కారుణ్య నియామకాలు కల్పించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
పేద, మధ్యతరగతి ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ జీవనాడి. రోజుకు 65 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్న ఆర్టీసీని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి ఆర్టీసీకి కొత్త ఊపునిచ్చాం. ఇప్పటివరకు… pic.twitter.com/ihVtTtr5wb
— Ponnam Prabhakar (@Ponnam_INC) September 10, 2026
ఇది కూడా చదవండి: Anumula Brothers Allegations | రాష్ట్రంలో అనుముల సోదరుల దోపిడీ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు