Telangana Udyamakarula Committee | తెలంగాణ ఉద్యమకారులకు ‘రాజ గౌరవం’.. జర్నలిస్టులకు గుర్తింపు లభించేనా..?

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Udyamakarula Committee | స్వరాష్ట్ర కల సాకారం కోసం అలుపెరగని పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులకు తీపి కబురు అందింది. మలిదశ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారిని గుర్తించి, వారికి సముచిత గౌరవం, గుర్తింపు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఈ మేరకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన (General Administration) విభాగం G.O.Rt.No.679 (తేదీ: 15.05.2026) ఉత్తర్వులను జారీ చేసింది.

Telangana Udyamakarula Committee | కమిటీ సారథ్యం.. సభ్యుల వివరాలు

సీనియర్ నాయకులు డాక్టర్ కె. కేశవరావు ఛైర్మన్‌గా వ్యవహరించనున్న ఈ కమిటీలో ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న పలువురు ప్రముఖులకు చోటు కల్పించారు.

ఛైర్మన్: డాక్టర్ కె. కేశవరావు

సభ్యులు:

  • పొన్నం ప్రభాకర్ (మంత్రి)
  • ప్రొఫెసర్ ఎం. కోదండరాం (MLC)
  • అద్దంకి దయాకర్ (MLC & విప్)
  • ఎస్. రాములు నాయక్ (మాజీ ఎమ్మెల్సీ)
  • మోతే శోభన్ రెడ్డి

Telangana Udyamakarula Committee | కమిటీ బాధ్యతలు ఇవే..

ఈ కమిటీ ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది:

  • గుర్తింపు ప్రమాణాలు: అసలైన “తెలంగాణ ఉద్యమకారులను” గుర్తించడానికి శాస్త్రీయమైన ప్రాతిపదికన నిబంధనలను (Criteria) రూపొందించడం.
  • జాబితా తయారీ: అర్హులైన ఉద్యమకారులందరితో కూడిన సమగ్రమైన జాబితాను సిద్ధం చేయడం.
  • గౌరవ మర్యాదలు: గుర్తించిన ఉద్యమకారులకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సత్కారాలు అందించాలి? వారికి కల్పించాల్సిన సౌకర్యాలు, ఇతర ప్రోత్సాహకాలపై ప్రభుత్వానికి సిఫార్సులు చేయడం.

దశాబ్దాల కాలం పాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది సామాన్యులు, విద్యార్థులు, మేధావులు భాగస్వాములయ్యారు. ఇన్నాళ్లకు వారి త్యాగాలను గుర్తించేందుకు అధికారికంగా కమిటీ వేయడం పట్ల ఉద్యమ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. కేవలం గుర్తింపు కార్డులకే పరిమితం కాకుండా, వారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందేలా ఈ కమిటీ చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు.

Telangana Udyamakarula Committee | ఆంధ్రా యాజమాన్యం కింద పనిచేస్తూనే..

అయితే, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెర వెనుక కీలక భూమిక పోషించిన వారిలో జర్నలిస్టులుగా కూడా ఉన్నారు. ఆంధ్రా మీడియా యాజమాన్యం కింద పనిచేస్తూనే.. ఉద్యమానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో వీరి పాత్ర వెల కట్టలేనిదనడంలో అతిశయోక్తి లేదు.

ఓ వైపు ఉద్యమాన్ని తగ్గించి చూపాలని ఒత్తిడి, ఇతర పనులు పురమాయించడం తదితర వాటిల్లో జర్నలిస్టుల దృష్టి మళ్లించేందుకు యాజమాన్యం శత విధాలుగా ప్రయత్నించినా.. జిల్లా, మండల, గ్రామీణ స్థాయిలో ఉద్యమాన్ని ప్రత్యక్షంగా.. క్షేత్రస్థాయిలో.. ఎప్పటికప్పుడు చూపించేందుకు జర్నలిస్టులు ఉరుకులు పరుగులు పెట్టారు.

నిజామాబాద్​తోపాటు పలు జిల్లా కేంద్రాల్లో అయితే కొన్ని యూనియన్​ల వెనుక ఏకంగా జర్నలిస్టులే ఉండి ఉద్యమించేలా ప్రోత్సహించారు.

కాగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. జర్నలిస్టుల తలరాతలు ఏమాత్రం మారలేదు. అదే లైన్​ అకౌంట్​, ఫొటో బిల్లు, నాన్​ మస్టర్​ రోల్​ కింద పనుల బాధ్యతలు.. స్వరాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం గడిచినా.. పరిస్థితి అంతే ఆధ్వానంగా ఉంది. మరి, ఈ కమిటీ జర్నలిస్టుల పోరాటాలను గుర్తిస్తుందా.. లేదా అనేది వేచి చూడాల్సిందే.

Smita Sabharwal IAS | ప్రజల అధికారి ‘స్మితా సభర్వాల్’.. అంకితభావానికి నిలువెత్తు రూపం

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *