దేశీయ ప్రదర్శన కళల రంగానికి నూతన జవజీవాలు అందిస్తూ, భారతదేశ అపురూపమైన సంస్కృతిని కాపాడేందుకు ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆదిత్య బిర్లా గ్రూప్ ఒక చారిత్రాత్మక వేదికను ఆవిష్కరించింది. ముంబై వేదికగా 22 జూన్ 2026 నాడు “ఐఎన్టీ ఆదిత్య బిర్లా పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అకాడమీ” (INT Aditya Birla Performing Arts Academy) ని అధికారికంగా లాంచ్ చేశారు. 1940ల నాటి భారత స్వాతంత్ర్య సమరం నుండి నేటి వరకు ఎందరో మహోన్నత కళాకారుల ఎదుగుదలకు కారణమైన ‘ఇండియన్ నేషనల్ థియేటర్’ (INT) ఆశయాలకు సరికొత్త రూపాన్ని ఇస్తూ ఈ సంస్థను స్థాపించారు. అకాడమీ చైర్‌పర్సన్ శ్రీమతి రాజశ్రీ బిర్లా గారితో పాటు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, నీరజా బిర్లా, అలన్యా బిర్లా , ఆర్యమన్ విక్రమ్ బిర్లా ల సమక్షంలో ఈ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది.
పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు , ఆసుపత్రుల వంటి శాశ్వత ప్రజా ఆస్తులను నిర్మించడం ద్వారా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవడం ఆదిత్య బిర్లా గ్రూప్‌కు ఉన్న ఒక విశిష్టమైన సంప్రదాయం. ఆ సుదీర్ఘ వారసత్వానికి కొనసాగింపుగానే ఇప్పుడు ఐఎన్టీ (INT) ని పునర్నిర్మించి, భారతీయ నృత్య, సంగీత, నాటక రంగాలలో సరికొత్త ప్రయోగాలకు ఒక జాతీయ వేదికను కల్పించారు. సృజనాత్మకత , సంస్కృతి అనేవి ఒక ఆరోగ్యకరమైన సమాజానికి అత్యంత ముఖ్యమైన స్తంభాలు అనే ఆదిత్య విక్రమ్ బిర్లా గారి నమ్మకానికి నిజమైన నివాళిగా ఈ సంస్థను తీర్చిదిద్దినట్లు రాజశ్రీ బిర్లా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
దిగ్గజాల సమక్షంలో ప్రారంభ వేడుక.. అరుదైన సాంస్కృతిక ఆర్కైవ్స్
భారతీయ ప్రదర్శన కళల రంగానికి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన దిగ్గజాలు ఈ నూతన అకాడమీ సలహా మండలిలో (Advisory Council) సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, డాక్టర్ ఎన్. రాజం, శంకర్ మహదేవన్, ఉల్హాస్ కశాల్కర్, అరుణా సాయిరాం, లాల్గుడి జిజెఆర్ కృష్ణన్, లూయిస్ బ్యాంక్స్, సిద్ధార్థ్ రాయ్ కపూర్, రజిత్ కపూర్ , టెరెన్స్ లూయిస్ వంటి ఎందరో ప్రముఖులు హాజరయ్యారు.
ఈ ప్రత్యేక ప్రారంభ రాత్రి వేదికపై భారతీయ కళల వైవిధ్యాన్ని చాటిచేప్పేలా అద్భుతమైన కార్యక్రమాలు జరిగాయి:
ప్రముఖుల సంభాషణ: ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ కవి, రచయిత జావేద్ అక్తర్.. సైరస్ సాహుకార్‌తో జరిగిన ప్రత్యేక చర్చా సెషన్‌లో పాల్గొని సృజనాత్మకత, జీవిత అనుభవాల గురించి ముచ్చటించారు.
సంగీత నివాళి: ప్రముఖ గాయని కౌషికి చక్రవర్తి.. లెజెండరీ గాయనులైన నూర్జహాన్, శోభా గుర్తూ, కిషోరి అమోంకర్ , బేగం అక్తర్ ల జ్ఞాపకార్థం సాంప్రదాయ, ఆధునిక శైలుల కలయికగా అందించిన సంగీత ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
గత దశాబ్దాలలో పి.ఎల్. దేశ్‌పాండే, డాక్టర్ శ్రీరామ్ లగూ, అమ్రీష్ పురి, సదాశివ్ అమ్రాపూర్కర్, స్మితా పాటిల్, సంజీవ్ కుమార్, పరేష్ రావల్ వంటి మహోన్నత నటులను దేశానికి అందించిన ఘనత ఐఎన్టీ (INT) కి ఉంది. ఈ అపురూపమైన చరిత్రను భావి తరాల కోసం భద్రపరిచే లక్ష్యంతో అకాడమీలో ఒక ప్రత్యేక ఆర్కైవల్ కేంద్రాన్ని (Archival Centre) ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ అరుదైన పాత సంగీత రికార్డింగులు, చారిత్రాత్మక ప్రదర్శనలు , మైలురాయి లాంటి సినిమా పనుల తాలూకు రికార్డులను నిల్వ చేయనున్నారు.
ఉచిత కళా విద్య.. సామాజిక సమగ్రతకు ప్రాధాన్యత
పూర్తిగా లాభాపేక్ష లేని (Not-for-profit initiative) సామాజిక దృక్పథంతో ఈ అకాడమీ తన సేవలను అందించనుంది. కేవలం కళాత్మక నైపుణ్యాలను పెంపొందించడమే కాకుండా, సమాజంలో వెనుకబడిన లేదా నిరుపేద వర్గాల (Underserved communities) పిల్లలకు , యువతకు ఈ ప్రదర్శన కళలను ఉచితంగా చేరవేయడమే దీని ప్రధాన లక్ష్యం. దీనివల్ల నిరుపేద విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి, సమాజంలో వారికి సరికొత్త అవకాశాలు మెరుగవుతాయని, తద్వారా సామాజిక సమగ్రత (Social inclusion) సాధ్యమవుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. సమాజాన్ని మరింత శక్తివంతం చేసే ఆదిత్య బిర్లా గ్రూప్ సుదీర్ఘ సేవా సంప్రదాయంలో ఈ అకాడమీ ఒక మైలురాయిగా నిలవనుంది.