Akali Dal BJP Alliance | మళ్లీ బీజేపీ-అకాలీదళ్‌ పొత్తు? మోడీతో భేటీ తర్వాత సుఖ్‌బీర్‌ బాదల్‌ కీలక ప్రకటన

మహిళలకు గౌరవం, సమానత్వం, సమాన హక్కులు కల్పించాలనే సిక్కు గురువుల బోధనలే తమ పార్టీ వైఖరికి స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Akali Dal BJP Alliance | పంజాబ్‌ Panjab రాజకీయాల్లో మరోసారి శిరోమణి అకాలీదళ్‌ (SAD)-బీజేపీ పొత్తుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అకాలీదళ్‌ అధినేత సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ భేటీ అయిన మరుసటి రోజే.. పార్లమెంట్‌లో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation), మహిళా రిజర్వేషన్‌ అంశాలపై తమ పార్టీ వైఖరిని వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది.

Akali Dal BJP Alliance | మహిళా రిజర్వేషన్‌ అమలుకు డిమాండ్​..

దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్‌ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని అకాలీదళ్‌ డిమాండ్‌ చేసింది. అదే సమయంలో అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను ఏకరీతిగా 50 శాతం పెంచే కేంద్ర ప్రతిపాదనకు మద్దతు ఇస్తున్నట్లు సుఖ్‌బీర్‌ బాదల్‌ ప్రకటించారు.

చండీగఢ్‌లో అకాలీదళ్‌ సీనియర్‌ నేతల సమావేశం అనంతరం బాదల్‌ ఈ విషయాలను వెల్లడించారు. మహిళలకు గౌరవం, సమానత్వం, సమాన హక్కులు కల్పించాలనే సిక్కు గురువుల బోధనలే తమ పార్టీ వైఖరికి స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. శిరోమణి గురుద్వారా పర్బంధక్‌ కమిటీ (SGPC)లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించే విధానం ఇప్పటికే అమల్లో ఉందని గుర్తుచేశారు.

Kavitha’s BC Slogan | బీసీ నినాదం.. అవకాశవాద రాజకీయాల ఓటు బ్యాంక్ గేమ్!

పార్లమెంట్‌లో చర్చకు వస్తున్న కీలక అంశాలపై చర్చించిన అనంతరం.. అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలా న్యాయమైన నియోజకవర్గాల పునర్విభజన జరగాలని అకాలీదళ్‌ కోరింది.

కేంద్రం ప్రతిపాదించిన విధంగా అన్ని రాష్ట్రాల్లో సీట్లను 50 శాతం పెంచే ప్రతిపాదనకు పార్టీ మద్దతు ఇస్తున్నట్లు బాదల్‌ స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌ రెండింటినీ ఆలస్యం చేయకుండా అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Akali Dal BJP Alliance | గతంలో వ్యతిరేకించిన అకాలీదళ్‌

అయితే డీలిమిటేషన్‌ విషయంలో అకాలీదళ్‌ తాజా వైఖరి గతంలో తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా ఉండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. కేంద్రం ఈ బిల్లును తొలిసారి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సమయంలో అకాలీదళ్‌ ప్రతిపక్షాలతో కలిసి దానికి వ్యతిరేకంగా ఓటు వేసింది.

డీలిమిటేషన్‌ వల్ల పంజాబ్‌కు తక్కువ ప్రయోజనం కలుగుతుందని, పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రానికి లోక్‌సభ స్థానాల్లో స్వల్ప పెరుగుదల మాత్రమే ఉంటుందని అప్పట్లో అకాలీదళ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల పెంపు ఉంటుందనే ప్రతిపాదనకు మద్దతు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Akali Dal BJP Alliance | 2020లో తెగిపోయిన బంధం

బీజేపీ-అకాలీదళ్‌ మధ్య దాదాపు 25 ఏళ్లుగా కొనసాగిన రాజకీయ పొత్తు 2020లో తెగిపోయింది. కేంద్రంలోని అప్పటి వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సమయంలో అకాలీదళ్‌ ఎన్డీఏ నుంచి వైదొలిగింది.

ఆ తర్వాత 2022 పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో బీజేపీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోగా.. అకాలీదళ్‌ కేవలం ఒక స్థానానికే పరిమితమైంది.

Akali Dal BJP Alliance | మోడీ-బాదల్‌ భేటీతో పెరిగిన చర్చ

పార్లమెంట్‌లో శుక్రవారం ప్రధాని మోడీతో సుఖ్‌బీర్‌ బాదల్‌ సమావేశం కావడంతో రెండు పార్టీల మధ్య మరోసారి పొత్తు చర్చలు జరుగుతున్నాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా డీలిమిటేషన్‌పై అకాలీదళ్‌ మద్దతు ప్రకటించడంతో ఈ చర్చ మరింత వేడెక్కింది.

అకాలీదళ్‌, పంజాబ్‌ బీజేపీ నాయకత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాల్లో కొంతమంది పాత పొత్తును పునరుద్ధరించడానికి అనుకూలంగా ఉన్నారని రాజకీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన కొందరు నేతలు కూడా పొత్తు పునరుద్ధరణకు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం బీజేపీ కేంద్ర నాయకత్వం తీసుకోవాల్సి ఉంటుంది.

Akali Dal BJP Alliance | సీట్ల పంపకాలపై తర్వాతే చర్చ?

ఇదిలా ఉంటే, గత పొత్తులో బీజేపీ జూనియర్‌ భాగస్వామిగా ఉండగా అకాలీదళ్‌ ఆధిపత్యం కొనసాగింది. ఈసారి మాత్రం సమాన ప్రాతిపదికన పొత్తు ఉండాలని బీజేపీ కోరుకుంటున్నట్లు సమాచారం.

అయితే సీట్ల పంపకం వంటి అంశాలను తరువాత చర్చించవచ్చని అకాలీదళ్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పంజాబ్‌లో పార్టీ పరిస్థితిని మెరుగుపరచడం, రాజకీయంగా బలోపేతం కావడమే తక్షణ ప్రాధాన్యం అని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో రానున్న పంజాబ్‌ ఎన్నికల నాటికి బీజేపీ-అకాలీదళ్‌ పాత మైత్రి పునరుద్ధరణకు మార్గం సుగమమవుతుందా? అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *