అక్షరటుడే వెబ్‌డెస్క్: Vijay TVK Alliance | తమిళనాడు ( Tamil Nadu )రాజకీయాల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, సినీ నటుడు విజయ్ రాజకీయ అడుగులు వేగంగా పడుతున్నాయి. పార్టీ కూటమి విస్తరణపై దృష్టిసారించిన విజయ్, సెప్టెంబర్ 9న మిత్రపక్షాలతో అత్యంత కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో కొత్త రాజకీయ ఫ్రంట్ ఏర్పాటుతో పాటు కూటమికి ఒక నూతన నామకరణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ఎండీఎంకే, సీపీఎం, సీపీఐ, వీసీకే , కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలకు టీవీకే ఆహ్వానాలు పంపింది. గతంలో జరిగిన తొలి సమావేశానికి దూరంగా ఉన్న లెఫ్ట్ పార్టీలైన సీపీఐ, సీపీఎంలకు ఈసారి ప్రత్యేక ఆహ్వానాలు అందడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Vijay TVK Alliance | వైకో గ్రీన్ సిగ్నల్..
టీవీకే తలపెట్టిన ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఎండీఎంకే నేత వైకో సానుకూలంగా స్పందించి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో మిత్రపక్షాల మధ్య సమన్వయం, భవిష్యత్ ఎన్నికల వ్యూహాలపై ఈ భేటీలో లోతుగా చర్చించనున్నారు. అయితే, సీపీఐ మాత్రం తమ వైఖరిని ముందే స్పష్టం చేసింది. తాము టీవీకే కూటమిలో అధికారికంగా చేరబోమని, ఒకవేళ అవసరమైతే బయట నుంచి మాత్రమే మద్దతు ఇస్తామని, భవిష్యత్తులో ప్రభుత్వంలోనూ భాగస్వామ్యం కాబోమని తేల్చిచెప్పింది. సీపీఐ తీసుకున్న ఈ నిర్ణయం సెప్టెంబర్ 9 భేటీలో ప్రధాన చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Vijay TVK Alliance | విజయ్ మూవ్‌పై కాంగ్రెస్ ఫోకస్..
విజయ్‌ను దేశ ప్రధానిగా చూడాలంటూ టీవీకే వర్గాలు ప్రచారం చేస్తుండటంతో, ఆయన రాజకీయ కదలికలపై జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. సెప్టెంబర్ 9న జరిగే ఈ భేటీలో కూటమి విస్తరణ, పార్టీల భాగస్వామ్యం, కొత్త ఫ్రంట్ రూపకల్పనపై స్పష్టమైన నిర్ణయాలు వెలువడే ఛాన్స్ ఉంది. మొత్తంగా తమిళనాడు రాజకీయాల్లో విజయ్ రాజకీయ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఎవరెవరు ఆయనతో కలిసి నడుస్తారు? అనే ఉత్కంఠ ప్రస్తుతం సర్వత్రా నెలకొంది.
ఇది కూడా చదవండి: Nepal Floods | 1300 మందికి చేరిన మృతులు.. ఇంకా తేరుకోని నేపాల్