Anil Agarwal | పరిశ్రమలు, ప్రభుత్వం ఏకం కావాలి : వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anil Agarwal | ఫిక్కీ (FICCI) వేదికగా పరిశ్రమలను ఉద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగాన్ని ఉటంకిస్తూ వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఇటీవల సోషల్ మీడియాలో కీలక పోస్ట్ చేశారు. భారతదేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి, భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ప్రభుత్వం, ప్రైవేట్ రంగం మధ్య మరింత మెరుగైన సహకారం అవసరమని ఆయన అన్నారు.

సహజ వనరులు, ఇంధనం, తయారీ, భారీ పరిశ్రమల రంగాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలను పెద్ద ఎత్తున ప్రైవేటీకరించాలని ఆయన ప్రతిపాదించారు. ప్రైవేట్ రంగ నిర్వహణ ద్వారా ఉత్పాదకతను పెంచడం, ఉద్యోగాలను సృష్టించడం, ఎంఎస్‌ఎంఈ (MSME)ల వృద్ధిని ప్రోత్సహించడం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే, ప్రైవేటీకరణ అనేది ఉద్యోగుల తొలగింపు లేకపోవడం (నో రిట్రెంచ్‌మెంట్), ఉపాధిని మూడు రెట్లు పెంచడం అనే రెండు షరతులతో కూడి ఉండాలని ఆయన సూచించారు. కార్పొరేట్ కొనుగోళ్లకు ప్రత్యామ్నాయంగా ప్రజలకు షేర్ల పంపిణీని ప్రోత్సహించాలని, తద్వారా వచ్చే నిధులను ప్రభుత్వ రుణాలను తగ్గించడానికి, మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించవచ్చని పేర్కొన్నారు.

Anil Agarwal | సరళమైన నిబంధనలు

ప్రధానమంత్రి నొక్కిచెప్పిన ‘నమ్మకం’ (ట్రస్ట్) అనే అంశాన్ని ప్రస్తావిస్తూ, సుదీర్ఘ అనుమతుల ప్రక్రియల స్థానంలో స్వీయ-ధృవీకరణ (సెల్ఫ్-సర్టిఫికేషన్) , సరళమైన నిబంధనలను తీసుకురావాలని అగర్వాల్ కోరారు. ప్రభుత్వం స్పష్టమైన నియమాలను రూపొందించి, ఆడిట్‌ల ద్వారా వాటి అమలును పర్యవేక్షించాలని, దీనివల్ల వ్యాపారాలు , కొత్త పరిశ్రమలు వేగంగా ప్రారంభమై విస్తరించడానికి వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Anil Agarwal | ఖనిజాల అన్వేషణకు..

ఖనిజాలు, లోహాలు, హైడ్రోకార్బన్‌ల రంగాల్లోని అన్వేషణ (ఎక్స్‌ప్లోరేషన్) యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లకు ఒక గొప్ప అవకాశమని అగర్వాల్ స్పష్టం చేశారు. అన్వేషణ రంగంలోని స్టార్టప్‌లు తాము కనుగొన్న వనరులను, భారీ స్థాయిలో మైనింగ్ , ప్రాసెసింగ్ పెట్టుబడులు పెట్టగల సామర్థ్యం ఉన్న ఓఎన్‌జీసీ (ONGC), హిందుస్థాన్ జింక్ వంటి దిగ్గజ సంస్థలకు విక్రయించేలా అనుమతించాలని ఆయన సూచించారు. చివరగా, ప్రైవేటీకరణ, స్వీయ-ధృవీకరణ , అన్వేషణ అంశాల చుట్టూ ఒక జాతీయ ఉద్యమాన్ని నిర్మించడానికి పరిశ్రమలు, ప్రభుత్వం , పౌరులు ఏకం కావాలన్నారు.

దీనిని కూడా చదవండి : Dowry Car Dispute | కారు కోసం పెళ్లి రద్దు చేసుకున్న పోలీస్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *