Ash Gourd Juice | రోజుకో గ్లాస్ ఈ జ్యూస్ తాగారో.. కొలెస్ట్రాల్, డయాబెటిస్‌కు చెక్!

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ash Gourd Juice | సాధారణంగా చాలామంది బూడిద గుమ్మడికాయను కేవలం దిష్టి తీయడానికో లేదా పండగలకు వడియాలు పెట్టడానికో మాత్రమే వాడుతుంటారు. కూరగాయగా దీనిని పెద్దగా పట్టించుకోరు. కానీ, ఆయుర్వేదంలో దీనిని ఒక అద్భుత ఔషధంగా పరిగణిస్తారనే విషయం మీకు తెలుసా? పోషకాల గని అయిన బూడిద గుమ్మడిని రోజూ జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొలెస్ట్రాల్, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక సంజీవనిలా పనిచేస్తుంది.

Ash Gourd Juice | అసలు బూడిద గుమ్మడిలో ఏముంది?

తెల్ల గుమ్మడి (Ash Gourd), కూష్మాండం, వింటర్ మెలన్ అని పిలిచే ఈ కాయలో శరీరానికి అవసరమైన ఎన్నో సూక్ష్మపోషకాలు ఉన్నాయి. ఇందులో పొటాషియం, క్యాల్షియం, ఫోలేట్, విటమిన్ బి1, బి9, సితో పాటు పీచు పదార్థం (ఫైబర్) పుష్కలంగా లభిస్తాయి.

Ash Gourd Juice | రోజుకో గ్లాస్ జ్యూస్‌తో అద్భుత ప్రయోజనాలు..

టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారు క్రమం తప్పకుండా 21 రోజుల పాటు ఈ రసాన్ని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయని కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇందులో క్యాలరీలు చాలా తక్కువ. కాబట్టి ఊబకాయం సమస్య ఉన్నవారు బరువు తగ్గడానికి ఇది బాగా దోహదపడుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది. మన శరీరంలో పేరుకుపోయిన హానికరమైన వ్యర్థాలను, విష పదార్థాలను బయటకు పంపడంలో ఈ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను దూరం చేసి జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది. వేళకు ఆకలి వేసేలా చేస్తుంది. కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి జ్వరం, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చడంతో పాటు మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

Ash Gourd Juice | బూడిద గుమ్మడి జ్యూస్ తయారు చేసే విధానం..

ఈ హెల్తీ జ్యూస్‌ను ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.

మొదట బూడిద గుమ్మడికాయను శుభ్రంగా కడిగి, పైన ఉన్న తొక్కను చెక్కేయాలి. లోపల ఉండే గింజల భాగాన్ని పూర్తిగా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను మిక్సీ జార్‌లో వేసి, దానికి కొద్దిగా అల్లం ముక్కలు, రుచికి సరిపడా రాళ్ల ఉప్పు, ఒక గ్లాసు నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఒక శుభ్రమైన వస్త్రం లేదా ఫిల్టర్‌తో వడకట్టుకుంటే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన బూడిద గుమ్మడి రసం సిద్ధమవుతుంది.

మార్కెట్లో చాలా తక్కువ ధరకే లభించే బూడిద గుమ్మడికాయలో ఇన్ని అద్భుత ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. కాబట్టి, ఇకపై దీనిని తక్కువ అంచనా వేయకుండా, మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.

ఇది కూడా చదవండి..: అమృతాంజన్ సరికొత్త అడుగు.. మహిళల కోసం ‘కాంఫీ’ రేజర్లు కీళ్ల నొప్పులకు ‘ఆర్థో ఆయిల్’

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *