అక్షరటుడే వెబ్‌డెస్క్: NMC Medical Advertising Rules | వైద్య రంగాన్ని పట్టిపీడిస్తున్న వ్యాపారాత్మక ధోరణులకు, ఆసుపత్రుల పేరిట జరిగే దగాకోరు ప్రచారాలకు చెక్ పెట్టేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. అమాయక రోగులను ఆకర్షించడమే లక్ష్యంగా కొందరు వైద్యులు, ప్రైవేటు ఆసుపత్రులు చేస్తున్న అసత్యపు ప్రకటనలపై ఎన్ఎంసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సరికొత్త కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఆరోగ్య సంరక్షణ అనేది లాభార్జన వ్యాపారం కాదని, అది ఒక పవిత్రమైన సేవ అని స్పష్టం చేస్తూ ఈ నూతన నిబంధనలను అమల్లోకి తెచ్చింది.
NMC Medical Advertising Rules | గ్యారంటీలపై నిషేధం..
ఈ కొత్త నిబంధనల ప్రకారం.. వైద్యులు లేదా ఆసుపత్రులు తమను తాము ప్రమోట్ చేసుకునే క్రమంలో అతిశయోక్తి పదాలను వాడటాన్ని ఎన్ఎంసీ పూర్తిగా నిషేధించింది. “మేమే స్టేట్‌లో నంబర్ 1 డాక్టర్”, “100 శాతం గ్యారంటీ ట్రీట్‌మెంట్ ఇస్తాం”, “మేమే బెస్ట్ స్పెషలిస్ట్” లేదా “మా దగ్గర మిరాకిల్ ట్రీట్‌మెంట్ ఉందంటూ” అబద్ధపు వ్యాపార ప్రకటనలు ఇస్తే ఇకపై ఊరుకునేది లేదని తేల్చిచెప్పింది. ఏ వైద్య విధానంలోనూ వంద శాతం ఫలితం ఉంటుందని గ్యారంటీ ఇవ్వలేమని, అలా చెప్పడం రోగులను మోసం చేయడమేనని హెచ్చరించింది.
NMC Medical Advertising Rules | భయపెట్టే మార్కెటింగ్ ..
మరోవైపు రోగుల్లో భయాన్ని పెంచి, అవసరం లేని వైద్య పరీక్షలు, ఖరీదైన సర్జరీలు చేయించే ‘ఫియర్-బేస్డ్’ మార్కెటింగ్ విధానాలకు కూడా ఎన్ఎంసీ చెక్ పెట్టింది. రోగులను భయపెట్టి లాభాలు ఆర్జించే దిశగా వ్యవహరించే ఆసుపత్రుల తీరుపై ఉక్కుపాదం మోపనుంది. అదేవిధంగా వాణిజ్య ప్రచారాల కోసం సర్జరీల సక్సెస్ స్టోరీలు ప్రచారం చేయడం, రోగులకు సంబంధించిన ‘బిఫోర్ – ఆఫ్టర్’ ఫోటోలను వాడకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉదాహరణకు ప్లాస్టిక్ సర్జరీ ( Plastic Surgery )లేదా బరువు తగ్గే చికిత్సల విషయంలో వైద్యానికి ముందు, వైద్యం తర్వాత అంటూ ఫోటోలు పెట్టి రోగులను ఆకర్షించడంపై పూర్తి నిషేధం విధించింది.
NMC Medical Advertising Rules | ఆఫర్లపై కఠిన బ్యాన్..
ఇంతేకాకుండా.. విక్రయాలను పెంచుకోవడానికి సూపర్ మార్కెట్ల తరహాలో డిస్కౌంట్లు ఇవ్వడం, క్యాష్‌బ్యాక్‌లు ప్రకటించడం, కూపన్లు, గిఫ్ట్‌లు ఇవ్వడం లేదా ఉచిత హెల్త్ చెకప్‌ల పేరుతో ఆఫర్లు పెట్టి ప్రచారాలు చేయడంపై కఠిన బ్యాన్ విధించింది. ఉచిత పరీక్షల పేరిట రోగులను ఆసుపత్రులకు రప్పించి, ఆ తర్వాత రకరకాల వ్యాధుల పేరుతో భయపెట్టి వేలాది రూపాయల బిల్లులు వేసే ధోరణికి ఈ నిర్ణయంతో అడ్డుకట్ట పడనుంది.
NMC Medical Advertising Rules | ప్రచారాలు బంద్..
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలు, పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్లతో ప్రచారాలు చేయించడం ఒక ఫ్యాషన్‌గా మారింది. అయితే ఇకపై ఏ వైద్యుడు కానీ, ఆసుపత్రి యాజమాన్యం కానీ సినిమా స్టార్లు లేదా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో తమ ఆసుపత్రులను, చికిత్సలను ప్రమోట్ చేయించకూడదని ఎన్ఎంసీ వెల్లడించింది. ఒకవేళ ఆధునిక సాంకేతికత అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందించిన డిజిటల్ కంటెంట్ లేదా బొమ్మలను వాడితే.. అది ఖచ్చితంగా ‘AI జనరేటెడ్’ అని స్పష్టంగా కనిపించేలా వాటర్‌మార్క్ వేయాలని స్పష్టం చేసింది.
NMC Medical Advertising Rules | ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు..
నేషనల్ మెడికల్ కమిషన్ జారీ చేసిన ఈ విప్లవాత్మక నిబంధనలను ఉల్లంఘించే వైద్యులు లేదా ఆసుపత్రులపై ఉపేక్షించే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు. మార్గదర్శకాలను పాటించకపోతే సంబంధిత వైద్యుల ప్రాక్టీస్ సస్పెన్షన్ నుంచి నేరుగా మెడికల్ లైసెన్స్ రద్దు చేసే వరకు అత్యంత కఠినమైన చర్యలు ఉంటాయని ఎన్ఎంసీ తీవ్రంగా హెచ్చరించింది. ఈ నిర్ణయంతో వైద్య రంగంలో వ్యాపార ధోరణులు తగ్గి, రోగులకు నాణ్యమైన, పారదర్శకమైన వైద్యం అందుతుందని సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Amazon Job Cuts | అమెజాన్‌లో 1000 ఉద్యోగాల కోత