అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana POB Lands | రాష్ట్రంలో నిషేధిత ఆస్తుల (పీవోబీ) జాబితాలో కొన్ని పొరపాట్లు జరిగినట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( Ponguleti Srinivas Reddy )స్పష్టం చేశారు. గతేడాది డిసెంబరులో పాత ఆస్తుల జాబితాలనే హైకోర్టుకు సమర్పించడం, అవే లిస్టులను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు పంపడం వల్లే ఈ సమస్య తలెత్తిందని అంగీకరించారు. సోమవారం సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటు ఆస్తులకు ఎదురవుతున్న ఇబ్బందులపై పలు కీలక ప్రకటనలు చేశారు.
Telangana POB Lands | సవరణకు ప్రత్యేక చర్యలు..
గతంలో సెటిలైన భూములు, క్రమబద్ధీకరించిన (రెగ్యులరైజ్ చేసిన) ప్రాపర్టీలను అప్‌లోడ్ చేయకపోవడం వల్ల జాబితాలో తప్పులు దొర్లాయని మంత్రి తెలిపారు. ముఖ్యంగా యూఎల్సీ (ULC) భూముల పార్శిళ్లు వివిధ సందర్భాల్లో రెగ్యులరైజ్ అయినప్పటికీ వాటిని పీవోబీలో పెట్టారని, వాటన్నింటినీ త్వరలోనే సరిచేస్తామన్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ప్రాంతాల్లో ప్రభుత్వం వేలం వేసినప్పుడు కొనుగోలు చేసిన ప్లాట్లు కూడా ఇందులో నమోదయ్యాయని, అలాంటి వాటిని సుమోటోగా తొలగించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఎవరైనా పీవోబీ సమస్యతో బాధపడుతుంటే 18005994788 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి తగిన సాయం పొందవచ్చని సూచించారు.
Telangana POB Lands | ఒక్క అప్లికేషన్‌తో పరిష్కారం..
ప్రభుత్వమే స్వయంగా ప్రైవేటు ఆస్తులను తొలగిస్తుందని, ఒకవేళ ఎక్కడైనా మిస్సయితే బాధితులు ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్, సబ్ రిజిస్ట్రార్ లేదా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్‌కు ఒక్క దరఖాస్తు పెట్టుకుంటే ఒకటి రెండు రోజుల్లోనే పరిష్కారమవుతుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల భూసేకరణ జరిగినప్పుడు పూర్తి సర్వే నంబరును బ్లాక్ చేశారని, ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాలో 12 ఎకరాల భూమిలో యజమాని రెండెకరాలు మాత్రమే భూదానం ఇచ్చినా, ఆ రెండు ఎకరాలు ఎక్కడో స్పష్టత లేకపోవడంతో మొత్తం 12 ఎకరాలను బ్లాక్ చేశారని వివరించారు. ఇకపై అధికారులు ఒకటి రెండు రోజుల్లో ఆ రెండు ఎకరాలకు కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసి, మిగతా 10 ఎకరాలను పీవోబీ నుంచి తొలగిస్తారని తెలిపారు. దేవాదాయ, వక్ఫ్, ఫారెస్ట్ భూముల్లోనూ ఇలాంటి సమస్యలు ఉన్నాయని వెల్లడించారు.
Telangana POB Lands | అధికారులకు హెచ్చరిక..
22-ఏ పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే హక్కు ఎవరికీ లేదని మంత్రి తేల్చిచెప్పారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పడం, కావాలని జాప్యం చేయడం ఇకపై సహించేది లేదన్నారు. నిజమైన భూ హక్కుదారుడికి న్యాయం చేస్తూనే ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని, ఈ రెండింటిలో ఏది నిర్లక్ష్యం చేసినా తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. సీఎస్ 7, సీఎస్ 14కి సంబంధించిన భూములు కూడా పీవోబీలో నమోదయ్యాయని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, అనుమతులు పొందిన వాటిని కండిషనల్ రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 35 వేల నుంచి 38 వేల ల్యాండ్ పార్శిళ్లు పీవోబీలో చేరాయని, మేడ్చల్ జిల్లాలోని ఆల్విన్ కాలనీ, ఆస్బెస్టాస్ కాలనీ, నారపల్లి తదితర ప్రాంతాల సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు.
Telangana POB Lands | ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు..
రాష్ట్రవ్యాప్తంగా పీవోబీ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఈ కమిటీ ప్రతి వారం సమీక్ష జరుపుతుందని, వారి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే తాను కూడా జిల్లాల్లో పర్యటిస్తానని, ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో 360 డిగ్రీల కోణంలో పకడ్బందీగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Harish Rao Kalyana Lakshmi | కల్యాణలక్ష్మి, రైతు బీమాపై కాంగ్రెస్ కుట్ర: హరీశ్ రావు