Maharashtra Cooking Oil Ban | లూజ్ ఆయిల్ విక్రయాలు బంద్.. సర్కార్ కీలక నిర్ణయం

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ఎఫ్‌డీఏ (FDA) సంచలన నిర్ణయం తీసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:  Maharashtra Cooking Oil Ban | ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ఎఫ్‌డీఏ (FDA) సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లూజ్ వంటనూనెల అమ్మకాలను పూర్తిగా నిషేధించడంతో పాటు, ఒకసారి కాచిన నూనెను పదే పదే వేడి చేసి వాడటాన్ని నిషేదించింది. ఈ మేరకు ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముంధే 14 కీలక అంశాలతో కూడిన కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు.

Maharashtra Cooking Oil Ban | భారీగా అక్రమాలు..

ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో భారీగా అక్రమాలు బయటపడ్డాయి. 2025-26 సంవత్సరానికి సంబంధించి 1,247 వంట నూనె శాంపిల్స్ పరీక్షించగా.. వాటిలో 77 నాణ్యత లేనివిగా, 13 ప్రమాదకరమైనవిగా, 15 మిస్‌బ్రాండెడ్‌గా తేలాయి. లైసెన్సులు లేకుండా వ్యాపారాలు చేయడం, ఆవనూనెలో ఇతర నూనెలు కలపడం, గడువు ముగిసిన నూనెను రీప్యాకింగ్ చేయడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించి, సుమారు రూ. 5.3 కోట్ల విలువైన 3.2 లక్షల కిలోల కల్తీ నూనెను సీజ్ చేశారు.

Maharashtra Cooking Oil Ban | కఠిన నిబంధనలు..

ఇకపై ఎలాంటి లూజ్ వంటనూనె విక్రయించడానికి వీలేదు. తయారీదారుల నుంచి ఆన్‌లైన్ విక్రేతల వరకు ప్రతి ఒక్కరూ సీల్ చేసిన, ట్యాంపర్-ప్రూఫ్, లేబుల్ ఉన్న ప్యాకెట్లలోనే నూనెను విక్రయించాలి. పాతవి, తుప్పు పట్టినవి లేదా గతంలో రసాయనాలు నిల్వ చేసిన టిన్ డబ్బాలను నూనె ప్యాకింగ్ కోసం మళ్లీ ఉపయోగించకూడదు. ఆవనూనె వంద శాతం స్వచ్ఛంగా ఉండాలి. మల్టీ-సోర్స్డ్ ఆయిల్స్ ప్యాకెట్లు 15 కిలోలకు మించకూడదు , వాటిపై తప్పనిసరిగా ‘అగ్‌మార్క్’ (AGMARK) సర్టిఫికేషన్ ఉండాలి.

Maharashtra Cooking Oil Ban | అనారోగ్య ముప్పు..

నూనెను పదే పదే వేడి చేయడం వల్ల అందులో ‘టీపీసీ’ (Total Polar Compounds) అనే ప్రమాదకర పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల క్యాన్సర్, బీపీ, కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఎఫ్‌డీఏ హెచ్చరించింది. నూనెలో టీపీసీ 25 శాతానికి మించితే అది వాడకానికి పూర్తిగా పనికిరాదు. అలా వ్యర్థమైన నూనెను కేవలం అధీకృత ‘రుకో’ (RUCO) ఏజెన్సీలకు మాత్రమే అప్పగించాలి.

Maharashtra Cooking Oil Ban | కఠిన శిక్షలు..

కొత్త నిబంధనలను ఉల్లంఘించి కల్తీ లేదా సురక్షితం కాని నూనె విక్రయిస్తే 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. నాణ్యత లేని నూనెకు రూ. 5 లక్షలు, తప్పుదోవ పట్టించే ప్రకటనలకు రూ. 10 లక్షల జరిమానాతో పాటు వ్యాపార లైసెన్సులను రద్దు చేసేలా కఠిన చర్యలు తీసుకోనున్నారు.


ఇది కూడా చదవండి: Tamil Nadu free cars | ఉచిత కార్లు మాకొద్దు.. డీఎంకే ఎమ్మెల్యేల ప్రకటన

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *