అక్షరటుడే, కామారెడ్డి: ABVP Protest Kamareddy | ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు షబ్బీర్ అలీ ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో కామారెడ్డి పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ABVP Protest Kamareddy | నినాదాల హోరు
కామారెడ్డి (Kamareddy) పాత బస్టాండ్ ప్రాంతం విద్యార్థుల నినాదాలతో మారుమోగింది. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుమారు వెయ్యికి పైగా విద్యార్థులు అడ్మిషన్ పొందారు. గతంలో కంటే మూడింతల విద్యార్థులు అడ్మిషన్లు పొందడంతో కళాశాలలో ఉన్న 10 తరగతి గదులు విద్యార్థులకు ఏమాత్రం సరిపోవడం లేదు. దాంతో గత కొద్దిరోజులుగా కళాశాలలో గదులను ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలు కోరుతూ వస్తున్నాయి. గురువారం విద్యార్థి సేన ఆధ్వర్యంలో నిజాంసాగర్ చౌరస్తాలో భారీ ఎత్తున ధర్నా చేపట్టగా శుక్రవారం ఏబీవీపీ నాయకులు వందలాది మంది విద్యార్థులతో ఏకంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంటి ముట్టడికి సిద్ధమయ్యారు. అప్రమత్తమైన పోలీసులు షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లకుండా రైల్వే స్టేషన్, ఇందిరా చౌక్ వద్ద విద్యార్థుల ర్యాలీని అడ్డుకున్నారు. దాంతో విద్యార్థులు ఇందిరాచౌక్ వద్దనే బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు భారీగా చేరుకుని విద్యార్థులు, ఏబీవీపీ నాయకులను సముదాయించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు.
ABVP Protest Kamareddy | పరిస్థితి ఉద్రిక్తంగా..
పోలీసులు ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా విద్యార్థులు ప్రతిఘటించారు. అయినా పోలీసులు ఏబీవీపీ నాయకులను లాక్కెళ్లి డిసిఎం వ్యానులో ఎక్కించారు. దాంతో ఇందిరాచౌక్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. వెయ్యి మంది విద్యార్థులున్న కళాశాలలో 10 తరగతి గదులు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. గత ఐదేళ్లుగా సరైన తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, బెంచీలు వంటి కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు చెట్ల నీడన పాఠాలు వినాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉంటే మారుమూల మండల కేంద్రాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు.
ఇది కూడా చదవండి..: Padkal Theft Case | పడకల్‌లో దొంగల బీభత్సం.. నగదు అపహరణ