అక్షరటుడే వెబ్‌డెస్క్: Chandrababu Development | ఆంధ్రప్రదేశ్‌ను ( Andhra Pradesh )సర్వతోముఖాభివృద్ధి చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతి వేదికగా జరిగిన టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర స్థూల అభివృద్ధిని నియోజకవర్గ స్థాయి ప్రగతితో అనుసంధానం చేయాలని పిలుపునిచ్చారు. సుస్థిర అభివృద్ధి, నీటి వనరులు, మౌలిక వసతులు, పెట్టుబడులు, ఉపాధి కల్పనపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రతి ప్రాంతంలోనూ అభివృద్ధి ఫలాలు స్పష్టంగా కనిపించేలా పక్కా ప్రణాళికలు రూపొందించాలని పార్టీ నాయకులకు సూచించారు.
Chandrababu Development | ఆర్థిక వృద్ధి లక్ష్యాలు..
రాష్ట్ర స్థాయి వృద్ధితో సరిపెట్టకుండా ప్రతి నియోజకవర్గం ఆర్థికంగా బలపడాలని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం జీడీపీ వృద్ధిలో విజయవాడ సెంట్రల్, పాలకొల్లు, మండపేట, చిలకలూరిపేట, నెల్లూరు సిటీ, తణుకు నియోజకవర్గాలు ముందంజలో ఉన్నాయని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో 15 నుంచి 20 రంగాలను ఎంచుకుని జీడీపీని పెంచేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకెళ్లి, ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి ద్వారానే ఓటు బ్యాంకును పెంచుకోవాలని, ప్రజల మద్దతును మరింత గట్టిగా కూడగట్టుకోవాలని సూచించారు.
Chandrababu Development | ఉపాధి అవకాశాలు..
రాష్ట్రానికి గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు వస్తుంటే దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆశ్చర్యపోయాయని, అయితే కొందరు మాత్రం కుట్రలు పన్నుతూ పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన 5 టీఎంసీల నీరు పెద్ద సమస్య కాదని, పోలవరం ఎడమ కాలువ ద్వారా రోజుకు దాదాపు 2 టీఎంసీల నీటిని సులభంగా తరలించవచ్చని చెప్పారు. ఇలాంటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.20.35 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించారు. పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చని తెలిపారు.
Chandrababu Development | జల వనరుల సద్వినియోగం ..
ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ ఈ ఏడాది గోదావరి నుంచి సుమారు 1,000 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లినట్లు చంద్రబాబు గుర్తుచేశారు. అందులో కనీసం 300 టీఎంసీలను వినియోగించుకున్నా రాష్ట్ర పరిస్థితుల్లో గణనీయమైన మార్పు వస్తుందన్నారు. రాబోయే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలోని రిజర్వాయర్లలో 1,250 నుంచి 1,400 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఏర్పడుతుందని వివరించారు. దీనివల్ల భూగర్భ జలాలు పెరిగి, వ్యవసాయానికి విద్యుత్ సబ్సిడీ భారం, ట్రాన్స్‌మిషన్ ఖర్చులు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు.
Chandrababu Development | కుప్పం తరహాలో సక్సెస్ స్టోరీలు..
కుప్పం సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని పారిశ్రామిక క్షేత్రాన్ని ఏర్పాటు చేసి రూ.30 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు తెలిపారు. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా విజయగాథలను సృష్టించాలని, ‘వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్’ విధానాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సూచించారు. దేశంలోనే నంబర్-1 డెవలపర్‌గా ఏపీని తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: KTR Arrest | కేసీఆర్‌ను చంపే ప్రయత్నం : కేటీఆర్