అక్షరటుడే వెబ్‌డెస్క్: Chronic Urticaria | శరీరంపై దద్దుర్లు కనిపించగానే ఏదో ఒక అలర్జీ అని చాలామంది భావిస్తుంటారు. మనం తిన్న ఆహారం, వాడిన మందులు లేదా చర్మానికి పూసిన క్రీముల వల్లే ఇవి వచ్చాయని అనుమానిస్తుంటాం. అయితే, ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా దద్దుర్లు పదేపదే వస్తుంటే మాత్రం దానిని కేవలం అలర్జీగా మాత్రమే పరిగణించలేమని నిపుణులు చెబుతున్నారు. ప్రతిసారీ అలర్జీ అని భావిస్తే.. వేరే ఆరోగ్య సమస్యను గుర్తించడంలో ఆలస్యం జరిగే ప్రమాదం ఉంది.
ఆరు వారాలకు మించి దద్దుర్లు లేదా వాపు పదేపదే వస్తుంటే దానిని ‘క్రానిక్ అర్టికేరియా’ అంటారు. ఇందులో ఒక రకమైన క్రానిక్ స్పాంటేనియస్ అర్టికేరియా (CSU) పరిస్థితిలో ఎలాంటి బాహ్య కారణం లేకుండానే లక్షణాలు మళ్లీ మళ్లీ కనిపిస్తుంటాయి. ఈ రెండింటి మధ్య తేటతెల్లమైన వ్యత్యాసాన్ని తెలుసుకోవడం ద్వారా సరైన చికిత్సను ఎంచుకోవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
Chronic Urticaria | డాక్టర్ హెచ్చరిక..
హైదరాబాద్‌లోని ( Hyderabad )జూబ్లీహిల్స్ ‘యూనిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిన్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ’ చీఫ్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ విజయ భాస్కర్ మల్లేల మాట్లాడుతూ.. పదేపదే వచ్చే దద్దుర్లు ఎప్పుడూ అలర్జీల వల్లే వస్తాయని చెప్పలేమన్నారు. లక్షణాలు ఆరు వారాల కంటే ఎక్కువగా ఉన్నా, లేదా స్పష్టమైన కారణం లేకపోయినా అది CSU అయి ఉండే అవకాశం ఉందన్నారు. నిపుణుల చేత సరైన మూల్యాంకనం చేయించుకోవడం ద్వారా అసలు కారణాన్ని గుర్తించి తగిన చికిత్స తీసుకోవచ్చని తెలిపారు. ఈ సమస్య నిద్రకు, దైనందిన జీవితానికి ఆటంకం కలిగిస్తుందని.. కాబట్టి దీనిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు.
Chronic Urticaria | ముఖ్యమైన అంశాలు..
ప్రతి దద్దురూ అలర్జీ కాదు: దద్దుర్లు అనేవి దురద కలిగించే పొక్కులు. ఇవి అలర్జీ వల్ల రావొచ్చు. కానీ ఎలాంటి బాహ్య కారణం లేకుండా వచ్చే CSUలో కూడా ఇవి ప్రధాన లక్షణంగా ఉంటాయి. కాబట్టి ఆహారం లేదా ఇతర వస్తువులే కారణమని ముందే నిర్ధారించకూడదు.
ఆరు వారాల గడువు కీలకం: దద్దుర్లు ఆరు వారాలకు మించి కనిపిస్తే దానిని దీర్ఘకాలిక సమస్యగా పరిగణించాలి. CSUలో ఒక్కో దద్దురు 24 గంటల్లో మాయమైనా.. శరీరంలోని ఇతర ప్రాంతాల్లో కొత్తవి వస్తుంటాయి. దద్దుర్లు ఎంతసేపు ఉంటున్నాయో గమనించి డాక్టర్‌కు వివరించాలి.
కారణాల కోసం వెతికి నిరాశ చెందకండి: CSU విషయంలో నిర్దిష్టమైన బాహ్య కారణాలు ఉండకపోవచ్చు. కొద్దిపాటి అంశాలు తీవ్రతను పెంచొచ్చు కానీ అవే అసలు కారణం కాకపోవచ్చు. అనవసరమైన ఆహార ఆంక్షలు పెట్టుకునే బదులు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
శారీరకమే కాదు, మానసిక ప్రభావం కూడా: నిరంతర దురద వల్ల నిద్రలేమి, పగటిపూట అలసట, ఏకాగ్రత లోపించడం జరుగుతుంది. చర్మంపై కనిపించే పొక్కులు సామాజికంగా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఇది వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది.
సరైన నిర్ధారణతోనే మెరుగైన చికిత్స: పదేపదే వచ్చే దద్దుర్లకు రకరకాల కారణాలు ఉండవచ్చు. చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి వైద్య చరిత్రను పరిశీలించుకోవడం ద్వారా లక్షణాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు.
ఇది కూడా చదవండి: Kamareddy Police Sports | క్రీడల్లో సత్తా చాటిన కామారెడ్డి పోలీసులు