అక్షరటుడే వెబ్‌డెస్క్: TCS Tech Days | ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) విద్యార్థుల నైపుణ్యాలను పెంచడమే లక్ష్యంగా చేపట్టిన ‘టీసీఎస్ టెక్ డేస్’ (TCS Tech Days) మొదటి విడత కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా 27 నగరాల్లోని 50 ప్రముఖ విద్యాసంస్థల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా 23,000 మందికి పైగా విద్యార్థులకు, 912 మంది అధ్యాపకులకు అత్యాధునిక సాంకేతికతపై ప్రత్యక్ష అవగాహన కల్పించింది. పరిశ్రమలు , విద్యాసంస్థల (Industry-Academia) మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడమే ధ్యేయంగా ఈ చొరవను చేపట్టింది.
TCS Tech Days | ఏఐ, క్లౌడ్..
మారుతున్న సాంకేతిక విప్లవానికి అనుగుణంగా విద్యార్థులను భవిష్యత్ ఉద్యోగాలకు సిద్ధం చేయడమే ఈ ‘టెక్ డేస్’ ముఖ్య ఉద్దేశం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొత్త తరం సాంకేతికతలను నిత్య జీవితంలో ఎదురయ్యే వ్యాపార సవాళ్లకు ఎలా ఉపయోగించాలో ఐటీ నిపుణులు విద్యార్థులకు వివరించారు. టీసీఎస్ నిపుణుల మార్గదర్శకత్వంలో తయారీ రంగంలో ఉత్పత్తుల అంతరాయాలు, బ్యాంకింగ్ సేవల మెరుగుదల, హెల్త్‌కేర్ విభాగంలో పేషెంట్ డిశ్చార్జ్ ప్లానింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు , రీటైల్ రంగానికి సంబంధించి ఏఐ ఆధారిత పరిష్కారాలను విద్యార్థులు ఆచరణాత్మకంగా రూపొందించారు. ఈ కార్యక్రమంలో 620 మందికి పైగా టీసీఎస్ నాయకులు, నిపుణులు పాల్గొని మొత్తం 92 మాస్టర్‌క్లాస్‌లు, 48 హ్యాకథాన్లు నిర్వహించారు.
భవిష్యత్ రంగానికి బలమైన పునాది: టీసీఎస్ హెచ్ఆర్ ఆఫీసర్
ఈ సందర్భంగా టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సుదీప్ కున్నుమల్ మాట్లాడుతూ.. భవిష్యత్తును శాసించే నైపుణ్యాలు వేగంగా మారుతున్నాయని, యువతను ఈ మార్పుకు సమర్థవంతంగా సిద్ధం చేయడానికి పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. కేవలం తమ సంస్థలోనే కాకుండా, సమాజంలో టాలెంట్ వ్యవస్థను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని వివరించారు. ఈ ‘టెక్ డేస్’ ద్వారా విద్యార్థులు తమ తరగతి గది విద్యను ఆచరణాత్మక నైపుణ్యాలుగా మార్చుకునేందుకు సహాయపడుతున్నామని ఆయన తెలిపారు.
TCS Tech Days | మరిన్ని కాలేజీలకు విస్తరణ..
అంతర్జాతీయ ‘స్టెమ్ డే’ (STEM Day) సందర్భంగా ఈ వివరాలను వెల్లడించిన టీసీఎస్.. మొదటి 50 టెక్ డేస్ విజయంతో మరింత ఉత్సాహంగా ముందుకుసాగుతోంది. మార్చి 2027 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న మరిన్ని విద్యాసంస్థలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించి, ఎక్కువ మంది విద్యార్థులకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: Kamareddy Police Sports | క్రీడల్లో సత్తా చాటిన కామారెడ్డి పోలీసులు