అక్షరటుడే వెబ్డెస్క్: Harish Rao Criticism | బీఆర్ఎస్ హయాంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రతి పథకంలోనూ అవినీతికి పాల్పడుతూ ‘స్కాంల ప్రభుత్వంగా’ మారిందని మాజీ మంత్రి హరీష్ రావు ( Harish Rao )ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్లో జరిగిన ఎస్ఐఆర్ (SIR) అవగాహన సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని , కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలనలో ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రతి విషయంలోనూ విఫలమైందని ఆయన విమర్శించారు.
Harish Rao Criticism | అవినీతి ఆరోపణలు..
సంక్షేమ శాఖల్లో పిల్లలకు అందించే ఆహార పదార్థాల్లోనే రూ. 2 వేల కోట్ల భారీ స్కాం జరిగిందని ఆయన ఆరోపించారు. తమ శాఖల్లో జరుగుతున్న అవినీతి స్వయంగా మంత్రులకే తెలియడం లేదని, అంతా సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని ఎద్దేవా చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న సీఎం, తన కుటుంబ సభ్యులను మాత్రమే కోటీశ్వరులను చేశారని విమర్శించారు.
Harish Rao Criticism | రైతు సమస్యలు..
పంట కోసి రెండు నెలలైనా వడ్ల కొనుగోలు సక్రమంగా జరగడం లేదని, వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం రైతులకు రూ. 19 వేల కోట్ల రైతుబంధు బకాయి పడిందని, రైతు భీమా నిలిచిపోయిందని, బోనస్ పేరుతో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. త్వరలో రాబోయే రైతు డిస్కమ్ వల్ల 24 గంటల విద్యుత్ కష్టమవుతుందని హెచ్చరించారు.
Harish Rao Criticism | ఖజానా ఖాళీ ..
ఖజానా ఖాళీగా ఉందని చెబుతున్న సీఎం, ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళన, అందాల పోటీలు, ఫుట్బాల్ మ్యాచ్లు , సొంత క్యాంపు ఆఫీసుల కోసం వందల కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును ఢిల్లీకి తరలించి రాహుల్ గాంధీకి అప్పజెపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పథకాలకు నిధులు లేవని చెబుతూనే, కమిషన్లు వచ్చే పనులకు మాత్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని విమర్శించారు.
Harish Rao Criticism | విద్యార్థుల భవిష్యత్తు..
ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ. 30 వేల కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, ప్రభుత్వం నిర్లక్ష్యంతో 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 16 వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారని, పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలున్నా కేవలం 5 వేల భర్తీకే మొగ్గు చూపుతున్నారని అన్నారు. పాలనా వైఫల్యాల వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు బూత్ స్థాయిలో ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను పర్యవేక్షించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ రమణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Cough Syrup Rules | దగ్గు మందుల విక్రయాలపై కఠిన నిబంధనలు విధించిన కేంద్రం