అక్షరటుడే వెబ్‌డెస్క్: Cough Syrup Rules | దగ్గు సిరప్‌లు ( Cough Syrup ) , ఇతర సిరప్ మందుల విక్రయాలపై కేంద్ర ఆరోగ్య శాఖ కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చింది. ఇకపై వైద్యుని ప్రిస్క్రిప్షన్ (డాక్టర్ రాసిచ్చిన చీటీ) లేకుండా ఈ మందులు కౌంటర్‌లో లభ్యం కావని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ 9, 2026న ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయగా, ప్రజారోగ్య భద్రత దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Cough Syrup Rules | దుర్వినియోగం అడ్డుకట్ట..
కోడైన్ వంటి మత్తు కలిగించే పదార్థాలు ఉన్న దగ్గు మందులను యువత వినోదం కోసం దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ కఠిన నిబంధనలతో ఇటువంటి అలవాట్లకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. గతంలో కొన్ని దగ్గు మందుల్లో ‘డైఇథిలీన్ గ్లైకాల్’ (DEG) వంటి పారిశ్రామిక విషపూరిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. దీనివల్ల దేశవ్యాప్తంగా పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Cough Syrup Rules | ఆరోగ్య ప్రమాదాలు..
డాక్టర్ సలహా లేకుండా వాడే యాంటీబయాటిక్ సిరప్‌ల వల్ల శరీరంలో యాంటీబయాటిక్ నిరోధకత (Antibiotic Resistance) పెరిగి, భవిష్యత్తులో చికిత్స కష్టమవుతుంది. అలాగే చిన్నారులకు స్వయంగా మందులు వాడటం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, మూర్ఛ వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. చాలామంది దగ్గును సాధారణ సమస్యగా భావించి మందులు కొంటారు. దీనివల్ల ఆస్తమా, క్షయ (TB), లేదా న్యుమోనియా వంటి దీర్ఘకాలిక వ్యాధుల నిర్ధారణ ఆలస్యమై పరిస్థితి విషమిస్తుంది. డాక్టర్ పర్యవేక్షణ ఉంటేనే ఈ ప్రమాదాలను గుర్తించి సకాలంలో చికిత్స అందించడం సాధ్యమవుతుంది.
Cough Syrup Rules | వైద్యుల స్వాగతం..
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైద్య నిపుణులు అందరూ స్వాగతించారు. ఈ కఠిన నిబంధన ఎంతో కాలంగా అవసరమని ప్రముఖ ఆసుపత్రుల వైద్యులు, శిశువైద్యులు పేర్కొన్నారు. దీనివల్ల అనవసరంగా ఆసుపత్రుల్లో చేరే పరిస్థితులు తగ్గడమే కాకుండా, బాధ్యతాయుతంగా మందులు వాడే అలవాటు పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. మందులు ప్రాణాలను కాపాడటానికి ఉద్దేశించినవి, కానీ సరైన మార్గదర్శకత్వం లేకపోతే అవే ప్రాణాంతకంగా మారవచ్చు” అని హెచ్చరించారు.
Cough Syrup Rules | ప్రజలకు సూచన..
ఈ మార్పు వల్ల రోగులు ఇకపై ఏ చిన్న ఆరోగ్య సమస్యకైనా నేరుగా మందుల షాపులకు వెళ్లకుండా, డాక్టరును సంప్రదించి చికిత్స పొందడం అలవాటు చేసుకోవాలి. ఇది సమాజంలో మరింత సురక్షితమైన, హేతుబద్ధమైన ఔషధ వినియోగానికి దారితీస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
ఇది కూడా చదవండి: Stock Market Rally | మూడో రోజూ లాభాల్లోనే..