అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Water Rights | ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 85 ప్రకారం తెలంగాణకు చట్టబద్ధంగా లభించిన నీటి హక్కులను పరిరక్షించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు లేఖ రాశారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) నిర్వహించనున్న 18వ సమావేశ అజెండాలోని 18.3.1, 18.3.6, 18.3.11 అంశాలను వెంటనే ఉపసంహరించాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధంగా ఆమోదించిన తెలంగాణ ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల అనుమతులను తిరిగి సమీక్షించే ప్రయత్నమే ఈ అజెండా అంశాల ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం రెండు రాష్ట్రాల మధ్య వివాదం కాదని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయ ప్రక్రియ విశ్వసనీయత, చట్టబద్ధతకు సంబంధించిన అంశమని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
Telangana Water Rights | కేంద్ర సంస్థల అనుమతులు..
తెలంగాణకు చెందిన సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అన్ని సాంకేతిక, జలవిజ్ఞాన, ఇంజినీరింగ్, పర్యావరణ, చట్టపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే అనుమతులు మంజూరు చేశాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని సమర్థ అధికార సంస్థలు ఇచ్చిన చట్టబద్ధ అనుమతులను జీఆర్ఎంబీ వంటి అనుబంధ సంస్థలు తిరిగి సమీక్షించే లేదా రద్దు చేసే అధికారం లేదని ఆయన స్పష్టం చేశారు. జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్ణయాలను జీఆర్ఎంబీ పునఃసమీక్షిస్తే కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సంస్థల అధికారాన్ని బలహీనపరిచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జీఆర్ఎంబీ అజెండాలో కాళేశ్వరం, చౌటుపల్లి హనుమంతరెడ్డి, ముక్తేశ్వరం, చనకా-కొరట (రుద్ర), మోదికుంటవాగు, కడెం-గూడెం, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం వంటి తెలంగాణ కీలక ప్రాజెక్టులకు ఇప్పటికే లభించిన అనుమతులను తిరిగి పరిశీలించే అంశాలు ఉన్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు.
రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంతర్ పరివాహక ప్రాంతాలకు నీటి మళ్లింపు చేపట్టే ముందు ఆయా పరివాహక ప్రాంత ప్రాజెక్టుల అవసరాలు తీర్చాలని నమోదైన అంశాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఇప్పటికే సీడబ్ల్యూసీ జలవిజ్ఞాన పరంగా అంగీకారం తెలిపిన సమ్మక్క సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి మిగిలిన చట్టబద్ధ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఇప్పటికే మంజూరైన అనుమతులను తిరిగి తెరపైకి తీసుకురావడం వల్ల భవిష్యత్తులో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, సీడబ్ల్యూసీ జారీ చేసే ప్రతి చట్టబద్ధ అనుమతిపై అనిశ్చితి ఏర్పడుతుందని, ఇది లక్షలాది మంది రైతుల ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Telangana Water Rights | హరీశ్‌రావు డిమాండ్లు..
జీఆర్ఎంబీ 18వ సమావేశ అజెండాలోని 18.3.1, 18.3.6, 18.3.11 అంశాలను వెంటనే ఉపసంహరించాలని ఆదేశించాలి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, సీడబ్ల్యూసీ ఇప్పటికే మంజూరు చేసిన టీఏసీ అనుమతులను తిరిగి సమీక్షించే ప్రతిపాదనలను జీఆర్ఎంబీ పరిగణనలోకి తీసుకోకుండా చూడాలి. సమ్మక్క సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంతో పాటు తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఇతర అర్హత కలిగిన సాగునీటి ప్రాజెక్టులకు మిగిలిన చట్టబద్ధ అనుమతులను వేగంగా మంజూరు చేయాలి. సకాలంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 నిబంధనలు పరిరక్షించబడటంతో పాటు తెలంగాణ నీటి హక్కులు కాపాడబడతాయని, కేంద్ర ప్రభుత్వ చట్టబద్ధ అనుమతుల ప్రక్రియ విశ్వసనీయత కూడా నిలబడుతుందని హరీశ్‌రావు తన లేఖలో ముగించారు.
🏛️ “తెలంగాణ నీటి హక్కులను కాపాడాలి.. కేంద్రానికి Harish Rao లేఖ”
🔸 BRS శాసనసభా పక్ష ఉపనేత, ఎమ్మెల్యే Harish Rao(@BRSHarish) , Union Jal Shakti Minister C.R. Patilకు లేఖ రాస్తూ, Andhra Pradesh Reorganisation Act, 2014లోని Section 85 ప్రకారం తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించాలని… pic.twitter.com/s1OqJdCpTp
— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) August 7, 2026
ఇది కూడా చదవండి: OBC National Conference | ఓబీసీ 11వ జాతీయ మహాసభల్లో నిజామాబాద్ బీసీ శ్రేణులు