అక్షరటుడే వెబ్‌డెస్క్: Harish Rao Revanth Reddy | సంగారెడ్డి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రస్థాయిలో స్పందించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇలాంటి విమర్శలు మాట్లాడటం బాధాకరమని, కానీ సీఎం చేస్తున్న అసత్య ప్రచారాలపై స్పందించక తప్పడం లేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రజలకు 420 హామీలు ఇచ్చి, ఇవాళ సమావేశంలోనూ అవే మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Harish Rao Revanth Reddy | ఉద్యోగాల భర్తీపై వైరుధ్యం..
అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 16 వేల ఉద్యోగాలిచ్చిందని చెప్పిన సీఎం.. సంగారెడ్డి ( Sangareddy )సభలో ఏకంగా 70 వేల ఉద్యోగాలిచ్చామని చెబుతున్నారని, ఇంత పచ్చి అబద్ధాలు చెప్పడానికి సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాల హామీని ఎగ్గొట్టి, జాబ్ క్యాలెండర్‌ను జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మార్చినందుకు నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలన్నారు. దమ్ముంటే గన్‌మెన్లు లేకుండా అశోక్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని సవాల్ విసిరారు.
Harish Rao Revanth Reddy | సంగారెడ్డికి చేసిందేమీ లేదు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సంగారెడ్డి జిల్లాకు చేసిందేమీ లేదని, కనీసం ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేదని విమర్శించారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల ఊసే ఎత్తకుండా కేవలం సొల్లు మాటలు చెప్పారన్నారు. అలాగే రేషన్ కార్డుల విషయానికొస్తే.. బీఆర్ఎస్ హయాంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారని, ఇప్పుడు మాత్రం ఎలాంటి కార్డులు ఇవ్వలేదంటూ కాంగ్రెస్ నాయకులు అసత్యాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao Revanth Reddy | రైతుబంధు లెక్కలపై సవాల్..
గత రెండున్నరేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నార్థకం చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ప్రతి ఏటా రూ.14 వేల కోట్లకు పైగా రైతుబంధు అందించామని గుర్తుచేశారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం రెండు ఆర్థిక సంవత్సరాలు కలిపి కేవలం రూ.15 వేల కోట్లే ఇచ్చిందని గణాంకాలతో సహా ఎత్తిచూపారు. రైతుబంధుపై తాను చెప్పింది తప్పైతే ముక్కు నేలకు రాస్తానని, సీఎం రేవంత్ దానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. రైతు రుణమాఫీ విషయంలోనూ దేవుళ్లపై ఒట్టుపెట్టి మోసం చేశారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy Jagga Reddy | రూ.100 కోట్లు ఇచ్చినా ఇలాంటి నేత దొరకరు: సీఎం రేవంత్ రెడ్డి