Hyderabad Chit Fund Scam | చిట్టీల పేరుతో మరో భారీ మోసం.. కేటుగాళ్లపై బాధితుల ఫిర్యాదు!

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad Chit Fund Scam| భాగ్యనగరంలో మరో ఆర్థిక మోసం వెలుగు చూసింది. సామాన్య ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయలతో ఒక జంట పరారయ్యేందుకు ప్రయత్నించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

Hyderabad Chit Fund Scam | అసలేం జరిగింది?

మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైష్ణవి కాలనీకి చెందిన సురేశ్ కుమార్, ఆయన భార్య వెంకట సాయి గత పదేళ్లుగా చిట్‌ఫండ్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. సురేశ్ కుమార్ అదే కాలనీకి ప్రెసిడెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో, స్థానికులు ఆయనను నమ్మి పెద్ద మొత్తంలో చిట్టీలు వేశారు. బాధితుల కథనం ప్రకారం.. ఒక్కొక్కరి నుంచి రూ. 2.5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు వసూలు చేశారు.

Hyderabad Chit Fund Scam | తిరగబడ్డ బాధితులు..

ఇటీవల కొన్ని చిట్టీల గడువు ముగియడంతో, తమకు రావాల్సిన నగదును తిరిగి ఇవ్వాలని బాధితులు సదరు దంపతులను కోరారు. అయితే, నగదు చెల్లించకుండా కాలయాపన చేస్తూ, వారిని చెక్కులు , ప్రామిసరీ నోట్లతో నమ్మించే ప్రయత్నం చేశారు. చివరకు బాధితులు గట్టిగా నిలదీయడంతో, సదరు దంపతులు బాధ్యతారాహిత్యంగా సమాధానం చెప్పడమే కాకుండా, బెదిరింపులకు దిగారు.

Hyderabad Chit Fund Scam | పోలీసులకు ఫిర్యాదు..

మోసపోయామని గ్రహించిన బాధితులంతా ఆదివారం మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. కష్టపడి దాచుకున్న సొమ్మును తమకు ఇప్పించి, న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: Modi Tattva | గుజరాత్ వర్సిటీలో ‘మోదీ’ పాఠం!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *