Tilak Varma Watch | షాట్‌తో పాటు వాచ్ కూడా పోయింది.. తిలక్ వర్మకు విచిత్ర అనుభవం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tilak Varma Watch | ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ముంబై యువ బ్యాటర్ తిలక్ వర్మ ఆడిన ఒక షాట్ విఫలమవడమే కాకుండా, అతని చేతికి ఉన్న ఖరీదైన ఫిట్‌నెస్ బ్యాండ్ కిందపడిపోవడం ఆసక్తికరంగా మారింది.

ముంబై ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో ఈ సంఘటన జరిగింది. సీఎస్‌కే ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ వేసిన చివరి బంతిని తిలక్ వర్మ స్కూప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి సరిగ్గా టైమ్ కాకపోవడంతో బ్యాట్‌కు తగలకుండా నేరుగా అతని మణికట్టుకు బలంగా తాకింది. ఆ ప్రభావంతో అతని చేతికి ఉన్న ‘హూప్’ ఫిట్‌నెస్ బ్యాండ్ ఊడిపోయి మైదానంలోకి ఎగిరిపోయింది.

Tilak Varma Watch | అంత ఖ‌రీదా?

దెబ్బ తీవ్రతతో తిలక్ (Tilak Varma) నొప్పితో విలవిలలాడుతూ వెంటనే ఫిజియోను పిలిపించాడు. కొద్దిసేపటి తర్వాత కోలుకున్న అతను మళ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే ఆ ఘటన జరిగిన రెండు బంతులకే నూర్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యి కేవలం 5 పరుగులతో పెవిలియన్ చేరాడు. తిలక్ ధరించిన ఆ వాచ్​ సాధారణ గడియారం కాదు. అది ‘హూప్’ అనే ఫిట్‌నెస్ ట్రాకింగ్ బ్యాండ్. దీని ధర సుమారు రూ.28 వేల వరకు ఉంటుంది. అగ్రశ్రేణి క్రికెటర్ విరాట్ కోహ్లీ వంటి వారు కూడా తమ ఫిట్‌నెస్, నిద్ర, స్ట్రెస్ లెవల్స్‌ను ట్రాక్ చేయడానికి ఈ పరికరాన్ని ఉపయోగిస్తుంటారు. బంతి బలంగా తాకినప్పటికీ ఆ బ్యాండ్‌కు ఎలాంటి నష్టం జరగకపోవడం విశేషం.

Tilak Varma Watch | చెన్నై విజయం

మ్యాచ్ విషయానికి వస్తే, ముంబై ఇండియన్స్ (Mumbai Indians) 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించిన చెన్నై జట్టు సునాయాసంగా గెలుపొందింది. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్), కార్తీక్ శర్మ (54 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయానికి నడిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. “వాచ్‌కు ఏమీ కాలేదు కానీ ముంబై ఆశలే కిందపడ్డాయి” అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి తిలక్ వర్మకు ఈ మ్యాచ్‌లో షాట్‌తో పాటు వాచ్ కూడా గుర్తుండిపోయే అనుభవాన్ని ఇచ్చింది.

ఇది కూడా చదవండి : Kohli Umpire Controversy | హోల్డర్ క్యాచ్‌పై వివాదం.. అంపైర్లతో కోహ్లీ వాగ్వాదం, చర్యలు తీసుకుంటారా?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *