అక్షరటుడే వెబ్‌డెస్క్: Curd Health Benefits |భారతదేశంలో చాలామంది రోజువారీ ఆహారంలో తగినంత ప్రోటీన్ తీసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సులభంగా లభించే పౌష్టికాహార ప్రత్యామ్నాయాలపై ప్రజల దృష్టి మళ్లుతోంది. ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరిచే బలవర్ధకమైన ఆహారం వైపు మొగ్గు చూపుతుండటంతో, మన సంప్రదాయ పాల ఉత్పత్తులకు మళ్లీ విశేష ఆదరణ లభిస్తోంది. ఇందులో భాగంగా పెరుగు మన ప్రధాన ఆహారంగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట్లోనూ పెరుగు ఎప్పటినుంచో ప్రధాన ఆహారంగా ఉంది. పెరుగన్నం, మజ్జిగ రూపంలోనే కాకుండా నంజుకోవడానికి కూడా దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. స్థానిక వాతావరణానికి సరిగ్గా సరిపోవడం, సులభంగా తయారు చేసుకోవడం వల్ల ఇది రోజువారీ భోజనంలో విడదీయరాని భాగమైంది.
Curd Health Benefits |పెరుగు వినియోగంలో అగ్రస్థానం..
పాల తర్వాత అత్యధికంగా వినియోగిస్తున్న పాల ఉత్పత్తుల్లో పెరుగు మొదటి స్థానంలో ఉందని ‘ఇండియా లాక్టోగ్రాఫ్’ తాజా నివేదిక వెల్లడించింది. దాదాపు 80 శాతం మంది తమ రోజువారీ ఆహారంలో పెరుగును భాగం చేసుకుంటున్నట్లు ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా 30 నుంచి 35 ఏళ్ల వయస్సు వారిలో దీని వినియోగం 90 శాతానికి పైగా ఉండగా, చిన్న పిల్లల తల్లిదండ్రులలో ఇది నూటికి నూరు శాతంగా ఉంది.
Curd Health Benefits | ఆరోగ్య ప్రయోజనాలు..
పెరుగు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ప్రోబయోటిక్స్‌ను అందిస్తుంది. శరీరానికి సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్‌తో పాటు, ఎముకలు, దంతాల పటిష్టతకు అవసరమైన క్యాల్షియం ఇందులో పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను నియంత్రించడం, రోగనిరోధక శక్తిని పెంచడం, గుండె ఆరోగ్యానికి తోడ్పడటంతో పాటు వేడి వాతావరణంలో శరీరానికి చలువ చేస్తుంది.
Curd Health Benefits | వివిధ రూపాల్లో పోషకాలు..
వివిధ రూపాల్లో ఉండే పెరుగు భిన్నమైన పోషక ప్రయోజనాలను అందిస్తుంది. తాజా పెరుగులో పేగుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సజీవ బ్యాక్టీరియా కల్చర్లు ఉంటాయి కాబట్టి తోడుకున్న వెంటనే తినడం చాలా మంచిది. ఇక నీటిని పూర్తిగా వడకట్టి తయారుచేసే హంగ్ కర్డ్ (గడ్డ పెరుగు) వంటి రూపాల్లో నీటి శాతం తక్కువగా ఉండటం వల్ల అధిక ప్రోటీన్ లభిస్తుంది. అలాగే, పెరుగు నుంచి వేరు చేసిన మిగులు నీటిలో (వే వాటర్) నీటిలో కరిగే ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల దీనిని వంటల్లో ఉపయోగించవచ్చు లేదా నేరుగా తాగవచ్చు.
పెరుగును పగటిపూట, ముఖ్యంగా మధ్యాహ్న భోజనంలో అన్నం, చిరుధాన్యాలు లేదా కాలానుగుణ పదార్థాలతో కలిపి తీసుకోవడం అత్యంత అనుకూలమని నిపుణులు సూచిస్తున్నారు. వినియోగదారులు ఎక్కువగా తక్కువగా ప్రాసెస్ చేసిన సహజ సిద్ధమైన పాల ఉత్పత్తుల వైపే మొగ్గు చూపుతున్నారని ఈ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్‌కు ( Godrej Agrovet )చెందిన డెయిరీ బ్రాండ్ ‘గోద్రెజ్ జెర్సీ’ తెలుగు రాష్ట్రాల ప్రజల రుచులకు అనుగుణంగా నాణ్యమైన పెరుగు ఉత్పత్తులను అందిస్తోంది.
ఇది కూడా చదవండి: Philippines Migration Policy | ఫిలిప్పీన్స్ మైగ్రేషన్ పాలసీపై ఎన్నారై అడ్వైజరీ కమిటీ అధ్యయనం