అక్షరటుడే, వెబ్డెస్క్ : Delhi Air Pollution | ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైంది. గాలి నాణ్యత భారీగా క్షీణించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ విమర్శలు చేసింది.
ఢిల్లీలో కాలుష్యాన్ని మరింత పెంచేందుకు పంజాబ్‌లో ఆప్ నాయకులు పొలాలకు నిప్పు పెడుతున్నారని ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా (Minister Kapil Mishra) ఆరోపించారు. ఈ ఘటనలపై విచారణ జరిపితే మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు కూడా దారితీయవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీజేపీ ప్రభుత్వం నిబంధనలను బలహీనంగా అమలు చేస్తోందని, గాలి నాణ్యతకు సంబంధించిన డేటాను అణచివేస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించాయి. బీజేపీ స్పందిస్తూ.. 25 ఏళ్ల పాలనలో ఈ సమస్యను పరిష్కరించకుండా, హిందూ పండుగల విషయంలో ప్రతిపక్షాలు తప్పులు వెతుకుతున్నాయని ఆరోపించింది.
Delhi Air Pollution | మాటల యుద్ధం
దీపావళి వేడుకల తర్వాత ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం దట్టమైన పొగతో కప్పబడి, పలుచోట్ల వాయు కాలుష్యం ‘తీవ్ర’ స్థాయికి చేరిన తరుణంలో ఈ మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 11.05 గంటలకు ఢిల్లీ మొత్తం గాలి నాణ్యత సూచిక 373గా నమోదైంది. అలీపూర్, బవానా, బురారీ, చాందినీ చౌక్, ముండ్కా, పంజాబీ బాగ్, రోహిణి మరియు వివేక్ విహార్ వంటి ప్రాంతాలలో AQI 400 దాటింది. కాలుష్య స్థాయిలు పెరుగుతున్న సమయంలో పలు పర్యవేక్షణ కేంద్రాలు రియల్-టైమ్ డేటాను ప్రదర్శించడం నిలిపివేయడం రాజకీయ విమర్శలకు దారి తీసింది. బీజేపీ మంత్రి మాట్లాడుతూ.. పంజాబ్‌లో రైతుల పొలాలకు ఆప్ నాయకులు నిప్పు పెట్టారని ఆరోపించారు. దీంతోనే ఢిల్లీలో కాలుష్యం పెరిగిందన్నారు. ఢిల్లీ నుంచి వచ్చి పంజాబ్‌లో మకాం వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు, వారి నాయకుల ఫోన్ రికార్డులను పరిశీలించాలని సూచించారు.
ఇది కూడా చదవండి..: Madhya Pradesh Fire Accident | మధ్యప్రదేశ్‌లో అగ్నిప్రమాదాలు.. 12 మంది మృతి