అక్షరటుడే వెబ్‌డెస్క్: Kya Bolti Public Campaign | విద్యార్థుల నిరసనలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. సామాన్యుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరిట ఓ జాతీయస్థాయి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ప్రజల ఆందోళనలను అర్థం చేసుకుని, వారి అభిప్రాయాలను సేకరించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన విద్య అందడం భారంగా మారుతోందని, అందుకే తొలుత ఈ అంశంపైనే తాము దృష్టిసారిస్తామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. సెప్టెంబర్ నెల నుంచి ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు మీడియా ద్వారా వెల్లడించారు.
Kya Bolti Public Campaign | విద్యపై పెరుగుతున్న భారం..
ఈ సందర్భంగా అభిజీత్ దీప్కే మాట్లాడుతూ విద్యావ్యవస్థ తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఒకటో తరగతికే ఫీజులు రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు చెల్లించాల్సి వస్తోందని, కొన్ని పాఠశాలల్లో ఇంకా అధికంగానే ఉంటున్నాయని చెప్పారు. ఈ భారీ ఖర్చుల కారణంగా మధ్యతరగతి కుటుంబాలు అప్పులపాలు కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందించడాన్ని ఒక భారంగా భావించకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పిన విధంగా విద్య ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని, కానీ గత కొన్నేళ్లుగా అది కేవలం ఒక వ్యాపారంగా మారిపోయిందని ఆయన విమర్శించారు.
Kya Bolti Public Campaign | మోసాల పట్ల అప్రమత్తత..
ఈ ప్రచార కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకునే వారు అధికారిక క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి చేరాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆ క్యూఆర్ కోడ్‌లను ప్రదర్శించారు. పార్టీలో సభ్యత్వం పూర్తిగా ఉచితం అని స్పష్టం చేసిన ఆయన, ఎవరైనా మోసపూరిత చెల్లింపులకు పాల్పడితే అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
వ్యవస్థలు సామాన్యులకు ఎప్పుడూ జవాబుదారీగా ఉండేలా, ప్రభుత్వాలపై నిరంతరం ఒత్తిడి తెచ్చే సంస్థగా సీజేపీ పనిచేస్తుందని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ప్రజలు ఉదయం ఒక పార్టీకి ఓటేస్తే సాయంత్రంకల్లా మరో పార్టీ అధికారంలోకి వచ్చేలా రాజకీయాలు మారిపోయాయని ఆయన విమర్శించారు.
🚨 CJP founder Abhijeet Dipke announces nationwide “Kya Bolti Public?” campaign to hear public grievances https://t.co/OBypIgu5WK pic.twitter.com/dhTuTrmmDK
— Public News X (@PublicNewsX) August 6, 2026
ఇది కూడా చదవండి: Bonalu Festival Significance | బోనం నైవేద్యంలో దాగి ఉన్న అద్భుత ఆరోగ్య సూత్రాలు..