అక్షరటుడే వెబ్‌డెస్క్: Delhi Building Safety | ఢిల్లీలో నివాస భవనాలను వాణిజ్య అవసరాలకు వాడుతుండటంపై సుప్రీంకోర్టు ( Supreme Court )తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సత్య నికేతన్ ప్రాంతంలో పీజీ భవనం కూలిపోయిన దుర్ఘటనపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. నివాస ప్రాంతాల్లో ఎలాంటి సేఫ్టీ రూల్స్ పాటించకుండా పెద్ద ఎత్తున పీజీలు, స్టూడెంట్ హాస్టళ్లు, జిమ్‌లు, కోచింగ్ సెంటర్లు నడుపుతున్నారని కోర్టు మండిపడింది.
ఒకే గదిలో వందల మందిని చేపల డబ్బాల్లో ప్యాక్ చేసినట్లు కుక్కుతున్నారని, కనీసం లోపలికి వెళ్లడానికి, బయటకు రావడానికి కూడా సరైన దారులు లేకుండా భద్రతను పూర్తిగా గాలికి వదిలేశారని జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలేజీలు, యూనివర్సిటీల పరిసరాల్లో రూల్స్‌కు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టి ఇలాంటి వ్యాపారాలు సాగిస్తున్నారని అమికస్ క్యూరీ అజిత్ కుమార్ సిన్హా కోర్టుకు వివరించారు.
Delhi Building Safety | అధికారులకు ఆదేశాలు..
సత్య నికేతన్ ఘటన కేవలం ఒక్క భవనానికి సంబంధించిన సమస్య కాదని, ఢిల్లీ వ్యాప్తంగా ఇలాంటి ఇళ్లు ఎన్నో కమర్షియల్ హాస్టళ్లుగా మారుతున్నాయని అమికస్ పేర్కొన్నారు. భవనాలు అప్రూవ్డ్ ప్లాన్ ప్రకారం ఉన్నాయా, ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటిస్తున్నారా, లోపల ఎలాంటి మార్పులు చేశారు అనే అంశాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని కోరారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD), ఢిల్లీ ప్రభుత్వం తదితర శాఖలన్నీ కలిసి ఈ అంశంపై పూర్తి స్థాయి స్టేటస్ రిపోర్ట్‌ను సెప్టెంబర్ 15లోగా సమర్పించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అధికారుల నివేదికల ఆధారంగా త్వరలోనే కోర్టు తదుపరి ఆదేశాలు ఇవ్వనుంది.
Delhi Building Safety | నేపథ్యం ఇదీ..
ఢిల్లీలోని సౌత్ క్యాంపస్ సమీపంలో ఉన్న సత్య నికేతన్‌లో ఐదు అంతస్తుల పీజీ భవనం ఇటీవల కుప్పకూలింది. ఈ దారుణ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ భారీ విషాదం తర్వాత ఢిల్లీలో అసురక్షితంగా ఉన్న ఇళ్లు, హాస్టళ్లు, కమర్షియల్ వెంచర్లపై ప్రభుత్వాలు దృష్టి సారించాయి. భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలనే డిమాండ్లు పెద్ద ఎత్తున వస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు ఈ విచారణ చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: MRI Scanning | మరో 9 ఆస్పత్రుల్లో ఎంఆర్ఐ సేవలు : మంత్రి రాజనర్సింహ