అక్షరటుడే వెబ్డెస్క్: Diesel Export Tax | అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా, దేశీయంగా ఇంధన లభ్యతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. విదేశాలకు ఎగుమతి చేసే డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)పై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (Windfall Tax) పెంచుతూ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.
Diesel Export Tax |కొత్త పన్ను రేట్లు ఇవే..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సవరించిన పన్ను రేట్లు జూన్ 16, 2026 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ తాజా మార్పుల ప్రకారం, డీజిల్ ఎగుమతులపై లీటరుకు ఉన్న సుంకాన్ని రూ. 13.50 నుంచి రూ. 14కు పెంచగా, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)పై పన్నును లీటరుకు రూ. 9.50 నుంచి రూ. 12.50కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, పెట్రోల్ ఎగుమతులపై ఎలాంటి పన్ను పెంపు లేదని, గతంలో మాదిరిగానే లీటరుకు రూ. 1.50 సుంకం యథావిధిగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

Diesel Export Tax | సామాన్యులపై ప్రభావం ఉండదు..
ఈ పెంపు కేవలం విదేశాలకు చేసే ఇంధన ఎగుమతులకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశీయంగా వినియోగించే పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు ఉండదని, సాధారణ వినియోగదారులపై దీని ప్రభావం పడదని అధికారులు భరోసా ఇచ్చారు.
Diesel Export Tax | ఎందుకు ఈ నిర్ణయం?
పశ్చిమాసియాలో చోటుచేసుకున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నెలకొన్న అస్థిరత కారణంగా దేశీయంగా ఇంధన కొరత తలెత్తకుండా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. రిఫైనరీలు విదేశీ మార్కెట్లలో అధిక లాభాల కోసం ఇంధనాన్ని తరలించకుండా, దేశీయ అవసరాలకు ప్రాధాన్యతనిచ్చేలా ఈ ఎగుమతి సుంకాన్ని (SAED) సవరించినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రతి పక్షం ( 15) రోజులకు ఒకసారి అంతర్జాతీయ ముడిచమురు ధరలను బట్టి ఈ పన్నులను సమీక్షిస్తుందనేది గమనార్హం.
ఇది కూడా చదవండి: E100 Ethanol Fuel | ఇక వంద శాతం ఇథనాల్ ఇంధనం!