అక్షరటుడే వెబ్‌డెస్క్: E20 Fuel | పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం (E20) వల్ల వాహనాల ఇంజిన్లు పాడవుతాయని, మైలేజీ తగ్గిపోతుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ మేరకు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక సమగ్ర వివరణను విడుదల చేస్తూ, వాహనదారులకు భరోసా ఇచ్చింది.
E20 Fuel | అపార్థాలకు తావులేదు..
E20 ఇంధనం వల్ల వాహనాలు పాడవుతాయని జరుగుతున్న ప్రచారంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ( Hardeep Singh Puri ) స్పందించారు. “ఇది ఒక అపార్థం, దీనిని నేను నమ్మను అని అన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 20 కోట్ల ద్విచక్ర వాహనాలు, 20 లక్షల కార్లు ఈ ఇంధనాన్ని వాడుతున్నాయి. వాహన తయారీదారులు , మెకానిక్‌ల నుండి కూడా ఎటువంటి ఫిర్యాదులు రాలేదు,” అని ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక కారణాల దృష్ట్యా, E20 ఇంధనం వాడటం వల్ల కొన్ని వాహనాల్లో మైలేజీ స్వల్పంగా (సుమారు 3 నుండి 5 శాతం) తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం అంగీకరించింది. అయితే, ఈ ఇంధనంలో ఉండే అధిక ఆక్టేన్ రేటింగ్, మెరుగైన యాంటీ-నాక్ లక్షణాలు , వేగవంతమైన దహనశక్తి వల్ల వాహనం పికప్ మెరుగుపడుతుందని, ఇంజిన్ పనితీరు మరింత స్వచ్ఛంగా ఉంటుందని వివరించింది.
E20 Fuel | ఎన్నో ఏళ్ల పరిశోధనల ఫలితం..
E20 ఇంధనాన్ని తొందరపాటుతో ప్రవేశపెట్టలేదు, ఇది రెండు దశాబ్దాల కఠిన శ్రమ ఫలితం. 2001లో పైలట్ ప్రాజెక్టులతో మొదలై, 2006లో 5 శాతం మిశ్రమంతో విస్తరించిన ఈ ప్రయాణం, ఎన్నో శాస్త్రీయ పరీక్షలు మరియు ఆటోమొబైల్ తయారీదారుల నివేదికల తర్వాతే 20 శాతానికి చేరుకుంది. నిపుణుల కమిటీల పర్యవేక్షణలోనే దీని అమలు జరుగుతోంది. ఈ కార్యక్రమం వల్ల దేశానికి ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు చేకూరాయి. ఇప్పటివరకు సుమారు రూ. 1.97 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడమే కాకుండా, రైతులకు నేరుగా రూ. 1.66 లక్షల కోట్ల ఆదాయం అందింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పుడు, ఈ ఇథనాల్ మిశ్రమం దేశ ఆర్థిక వ్యవస్థకు రక్షణ కవచంలా పనిచేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
E20 Fuel | పర్యావరణానికి పెద్దపీట..
ఈ కార్యక్రమం ద్వారా సుమారు 952 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించగలిగామని ప్రభుత్వం పేర్కొంది. భవిష్యత్తులో దేశ ఇంధన భద్రతను మెరుగుపరచడానికి, విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గించడానికి E20 ఇంధనం కీలకమని, ఇది పర్యావరణ పరిరక్షణలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: LIC Retired Employee | రూ.3.5 కోట్లతో ఎల్ఐసీ రిటైర్డ్ ఉద్యోగి పరార్.. ఆందోళనలో ఏజెంట్లు