అక్షరటుడే వెబ్‌డెస్క్: Finance Influencer Harish | చెన్నైలోని ముత్తుకాడ ప్రాంతంలో ఉన్న ఒక అద్దె విల్లాలో ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్ వీ హరీశ్ (27) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. పుదుచ్చేరికి చెందిన హరీశ్, సోషల్ మీడియాలో ‘ఫైనాన్స్ విత్ హరీష్’ (Finance with Harish) పేరుతో ఖాతాలు నిర్వహిస్తూ ఐదేళ్ల కష్టంతో సుమారు 13 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. అయితే, టెక్ వ్యవస్థాపకుడు, యూట్యూబర్ జేసన్ శామ్యూల్ తనపై చేసిన తప్పుడు ఆరోపణలు, వేధింపులు, అవమానాలు తట్టుకోలేకే ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నట్లు చనిపోయే ముందు హరీశ్ ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు.
Finance Influencer Harish | యూట్యూబ్ ఆరోపణలు..
కొద్దిరోజుల క్రితం వెంచర్ స్టూడియో ‘జెమూరియా ఇంక్’ సీఈఓ జేసన్ శామ్యూల్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సెబీ (SEBI) గుర్తింపు పొందిన ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ కాకుండానే హరీశ్ ఆర్థిక సలహాలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అలాగే AMFI లైసెన్స్ లేకపోయినా ఉన్నట్లు అబద్ధాలు చెప్తున్నారని ఆ వీడియోలో ఆరోపించారు. జేసన్ చేసిన ఈ తీవ్ర ఆరోపణల ఆధారంగా మెటా (Meta) సంస్థ హరీశ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను బ్లాక్ చేసింది. దీంతో హరీశ్ మరొక కొత్త అకౌంట్ క్రియేట్ చేసి వీడియోలు పెట్టగా, దానిని కూడా తొలగించడంతో ఆయన తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు.
Finance Influencer Harish | రూ. 3 కోట్లు డిమాండ్ ..
చనిపోయే ముందు విడుదల చేసిన వీడియోలో హరీశ్ స్పందిస్తూ.. జేసన్ తనను బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించాడని, తప్పుడు వీడియోలతో సోషల్ మీడియా అకౌంట్లు డిలీట్ చేయిస్తానని వేధించాడని ఆరోపించారు. దీనిపై హరీశ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. జేసన్ శామ్యూల్ రాజకీయ నాయకుల పేర్లు చెప్పి తన కొడుకును భయభ్రాంతులకు గురిచేసి రూ. 3 కోట్లు డిమాండ్ చేశాడని పేర్కొన్నారు. ఈ ఆన్‌లైన్ వేధింపుల వల్లే తన కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని, బాధ్యుడైన సీఈఓపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Finance Influencer Harish | ట్విటర్ ద్వారా వివరణ ..
ఈ వ్యవహారం తమిళనాడు వ్యాప్తంగా పెను దుమారం రేపడంతో జేసన్ శామ్యూల్ సామాజిక మాధ్యమం ‘X’ (ట్విటర్) ద్వారా స్పందించారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా వేధించలేదని, కేవలం హరీశ్ చేస్తున్న ఆర్థికపరమైన పొరపాట్లను, తప్పులను మాత్రమే ఎత్తిచూపానని వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, హరీశ్ ఆత్మహత్య వెనుక ఉన్న అసలు నిజానిజాలను తేల్చేందుకు లోతైన విచారణ ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Nizamabad Dasara Sammelanam | 23న జిల్లా మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ‘దసరా సమ్మేళనం’