అక్షరటుడే, వెబ్డెస్క్ : Himanta Biswa Sharma | అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిస్వా శర్మ మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనను సీఎంగా నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రమాణ స్వీకారం కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అస్సాంలో బీజేపీ (BJP) హ్యాట్రిక్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఎన్డీఏ 102 సీట్లలో విజయం సాధించింది. బీజేపీ సొంతంగా 82 చోట్ల గెలుపొందింది. కాంగ్రెస్ 19 సీట్లతో సరిపెట్టుకుంది. ఎన్డీఏ ఎమ్మెల్యేలు సమావేశం అయి శాసనసభా పక్షనేతగా హిమంత బిస్వా శర్మను ఎన్నుకున్నారు. ఆదివారం ఈ మేరకు ఆయన గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. దీంతో అస్సాం ముఖ్యమంత్రిగా హిమంతను నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Himanta Biswa Sharma | గౌహతిలో…
గవర్నర్ తరఫున అస్సాం నూతన ముఖ్యమంత్రి నియామక ఉత్తర్వులను జారీ చేసే అవకాశం లభించినందుకు తాను ఎంతో గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ట్వీట్ చేశారు. మే 12వ తేదీ ఉదయం 11:40 గంటలకు గౌహతిలోని ఖానాపారాలో ఉన్న వెటర్నరీ కళాశాల మైదానంలో సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), కేంద్ర మంత్రులు, పలురాష్ట్రాల బీజేపీ సీఎంలు హాజరు కానున్నారు.
Himanta Biswa Sharma | మూడో సారి
అస్సాంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం కొలువదీరనుంది. హిమంత బిస్వాశర్మ రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఇక్కడ 2016 నుంచి కమలం పార్టీ అధికారంలో ఉంది. 2016 నుంచి 2021 వరకు శర్బానంద సోనావాల సీఎంగా పని చేశారు. 2021లో హిమంత బాధ్యతలు చేపట్టారు. అనంతరం తన పరిపాలన, దూకుడు, మాటతీరుతో ప్రజల్లో అభిమానం సంపాదించుకున్నారు. మూడో సారి బీజేపీని గెలిపించడంలో కీలకంగా వ్యవహరించారు. దీంతో ఆయనకు బీజేపీ అధిష్టానం మరోసారి సీఎం పదవి కట్టబెట్టింది.
ఇది కూడా చదవండి..: AIADMK Factionalism | అన్నాడీఎంకేలో ముసలం.. ఓటమి తర్వాత ఈపీఎస్ vs షణ్ముగం వర్గాల ఆధిపత్య పోరు!

