అక్షరటుడే వెబ్‌డెస్క్: India Independence Day | భారతదేశ చరిత్రలో ఆగస్టు 15 చారిత్రక రోజు. దాదాపు రెండు శతాబ్దాల బ్రిటిష్ బానిస సంకెళ్లను తెంచుకుని, స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న మహత్తర సందర్భం ఇది. ఎందరో వీరుల ప్రాణత్యాగాలు, అహింసాయుత పోరాటాల ఫలితంగా స్వతంత్ర భారతావని ఆవిర్భవించింది. అయితే భారత్‌కి సరిగ్గా ఆగస్టు 15వ తేదీనే స్వాతంత్ర ఇవ్వడానికి వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. భారతదేశ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్ తీసుకున్న నిర్ణయమే ఈ తేదీకి ప్రధాన కారణం.
India Independence Day | అధికార బదిలీ నిర్ణయం వేగవంతం…
బ్రిటిష్ ప్రభుత్వం మొదట 1948 జూన్‌లోపు భారత్‌కి అధికారాన్ని బదిలీ చేయాలని భావించింది. కానీ అప్పటికే దేశంలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, మత ఘర్షణల తీవ్రత వల్ల పరిస్థితులు చేయిదాటిపోతాయని లార్డ్ మౌంట్‌బాటన్ గ్రహించారు. అందుకే శాంతిభద్రతల పరిరక్షణ కోసం అధికార బదిలీని 1947 ఆగస్టుకు ముందుకు జరపాలని ఆయన నిర్ణయించుకున్నారు.
India Independence Day | రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగుబాటు..
మౌంట్‌బాటన్ ఆగస్టు 15ను ఎంచుకోవడానికి రెండో ప్రపంచ యుద్ధ పరిణామాలు కారణమయ్యాయి. 1945 ఆగస్టు 15న మిత్రరాజ్యాల దళాలకు జపాన్ సైన్యం బేషరతుగా లొంగిపోయింది. ఆ సమయంలో మిత్రరాజ్యాల ఆగ్నేయాసియా విభాగానికి సుప్రీం కమాండర్‌గా ఉన్న మౌంట్‌బాటన్, ఆ విజయాన్ని తన జీవితంలోనే అత్యంత అదృష్టవంతమైన విజయంగా భావించారు.
India Independence Day | స్వాతంత్య్ర దినంగా ఖరారు…
జపాన్ ( Japan )లొంగిపోయి సరిగ్గా రెండేళ్లు పూర్తవుతున్న ఆ ప్రత్యేక రోజునే భారత్‌కు కూడా స్వాతంత్య్రం ఇవ్వాలని మౌంట్‌బాటన్ ప్రతిపాదించారు. దానికి అనుగుణంగా బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన చట్టం ద్వారా 1947 ఆగస్టు 15న భారతదేశం స్వేచ్ఛా దేశంగా అవతరించింది. అలా ప్రపంచ యుద్ధ విజయ జ్ఞాపకం, మన దేశ స్వాతంత్య్ర దినోత్సవ తేదీగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది.
ఇది కూడా చదవండి: Samay Raina | స్టాండప్ కమెడియన్ సమయ్ రైనాకు ఊరట