అక్షరటుడే వెబ్‌డెస్క్: Indian Alcohol Industry | భారతదేశ ( India )ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పన , ప్రభుత్వ ఖజానాకు ఆల్కహాలిక్ బెవరేజెస్ (ఆల్కోబెవ్) పరిశ్రమ భారీ స్థాయిలో సహకారం అందిస్తున్నట్లు ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ISWAI) విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. ‘ది ఎకనామిక్ వాల్యూ ఆఫ్ ది ఇండియన్ ఆల్కహాలిక్ బెవరేజ్ ఇండస్ట్రీ 2026’ పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. 2025 క్యాలెండర్ సంవత్సరంలో ఈ మార్కెట్ పరిమాణం రూ. 6.2 లక్షల కోట్లకు చేరుకుందని, ఇది దేశ నామమాత్రపు జీడీపీలో దాదాపు 1.8 శాతానికి సమానమని అంచనా వేసింది.
Indian Alcohol Industry | పన్నుల వాటా..
2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ రంగం ద్వారా సుమారు రూ. 4 లక్షల కోట్ల పన్ను ఆదాయం సమకూరింది. ఇది దేశ మొత్తం పన్ను వసూళ్లలో 6.6 శాతంగా ఉంది. నివేదిక మదింపు చేసిన 28 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో.. ఆయా రాష్ట్రాల సొంత పన్నుల ఆదాయంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 19 శాతంగా ఉంది. కొన్ని పెద్ద రాష్ట్రాల్లో ఇది 20 శాతానికి పైగా ఉండటం విశేషం. ఈ నిధులు మౌలిక వసతులు, ఆరోగ్యం, విద్య వంటి సంక్షేమ రంగాలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
Indian Alcohol Industry | వ్యవసాయ రంగంపై ప్రభావం..
దేశవ్యాప్తంగా మద్యం తయారీకి ఉపయోగించే తృణధాన్యాలు, చెరకు, మొలాసిస్, బార్లీ, ద్రాక్ష వంటి వ్యవసాయ ముడిసరుకుల ఉత్పత్తిలో సుమారు 24.2 లక్షల నుండి 25.5 లక్షల క్షేత్రాలు నిమగ్నమై ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 12.1 కోట్ల నుంచి 12.8 కోట్ల మంది రైతులకు ఈ రంగం ఉపాధిని ఇస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, లాంజ్‌లతో పాటు వ్యవస్థీకృత రిటైల్ రంగంలో లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. వ్యవసాయం, ఆతిథ్యం, రిటైల్ రంగాలు అన్నీ కలుపుకుని ఈ పరిశ్రమ సుమారు 1.44 కోట్ల ఉద్యోగాలకు మద్దతు ఇస్తోందని నివేదిక పేర్కొంది.
Indian Alcohol Industry | ఇతర రంగాలు..
వినియోగదారులు సాధారణ బ్రాండ్ల కంటే నాణ్యమైన, ఖరీదైన ప్రీమియం ఉత్పత్తులను ఎంచుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. 2022-2025 మధ్య కాలంలో సాధారణ ఉత్పత్తుల వృద్ధి కంటే ప్రీమియం విభాగం ఏకంగా 10.2 శాతం వార్షిక వృద్ధి రేటుతో దూసుకుపోవడం విశేషం. దేశంలో కంటైనర్ గ్లాస్ డిమాండ్‌లో దాదాపు 70 శాతం వాటా ఈ ఆల్కోబెవ్ పరిశ్రమదే ఉండగా, రవాణా , లాజిస్టిక్స్ రంగంలోనూ ఏటా వేల కోట్ల ఆర్థిక కార్యకలాపాలకు ఇది మద్దతుగా నిలుస్తోంది.
పన్నులు, లైసెన్సింగ్ విధానాలలో రాష్ట్రాల వారీగా కొన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ.. సరైన సంస్కరణలు, డిజిటలైజేషన్ , హేతుబద్ధమైన పన్ను విధానాలను అమలు చేస్తే ఈ రంగం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఎక్కువ విలువను సృష్టించే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Dasara Special Buses | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దసరాకు 7 వేల స్పెషల్ బస్సులు