అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPL 2026 Points Table | క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈసారి లీగ్ దశలో మూడు బలమైన జట్లు సమాన పాయింట్లు సాధించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
అయితే చివరికి నెట్ రన్ రేట్ సమీకరణాలు టేబుల్ స్థానాలను నిర్ణయించడంతో ఉత్కంఠభరిత ముగింపు కనిపించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కైవసం చేసుకుంది. మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ జట్టు 9 విజయాలు, 5 ఓటములతో 18 పాయింట్లు సంపాదించింది. అయితే గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్లు కూడా అదే స్థాయిలో 18 పాయింట్లు సాధించాయి. కానీ మెరుగైన నెట్ రన్ రేట్ ఆర్సీబీకి అగ్రస్థానాన్ని అందించింది.
IPL 2026 Points Table | ఆర్సీబీతో జీటీ ఫైట్..
ఆర్సీబీ జట్టు ప్లస్ 0.783 నెట్ రన్ రేట్‌తో లీగ్ దశను ముగించింది. దీంతో ప్రత్యర్థి జట్లపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ క్వాలిఫైయర్-1లో చోటు సంపాదించింది. సీజన్ మొత్తం మంచి ప్రదర్శన కనబరిచిన బెంగళూరు జట్టు ఈసారి ట్రోఫీపై బలమైన ఆశలు పెట్టుకుంది. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) కూడా సమానంగా 18 పాయింట్లు సాధించినప్పటికీ ప్లస్ 0.695 నెట్ రన్ రేట్ కారణంగా రెండో స్థానానికి పరిమితమైంది. సీజన్ మొత్తం అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ చివరి వరకు అగ్రస్థానం కోసం పోటీ ఇచ్చింది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా లీగ్ దశలో అద్భుత ఆటతీరు ప్రదర్శించింది. 9 విజయాలతో 18 పాయింట్లు సాధించినప్పటికీ ప్లస్ 0.524 నెట్ రన్ రేట్‌తో మూడో స్థానంలో నిలిచింది. సమాన పాయింట్లు వచ్చినా నెట్ రన్ రేట్ ఎంత కీలకమో ఈ సీజన్ మరోసారి స్పష్టం చేసింది.
IPL 2026 Points Table | ఐపీఎల్ చరిత్రలో అరుదైన సంఘటన
ఈసారి లీగ్ దశలో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఒక్క మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు కాకపోవడం. అన్ని జట్లు మైదానంలో తమ ప్రదర్శన ఆధారంగానే ప్లేఆఫ్స్ స్థానాలను నిర్ణయించుకున్నాయి. ప్లేఆఫ్స్ సమరంలో భాగంగా రెండు స్థానాల్లో నిలిచిన ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ జట్లు క్వాలిఫైయర్-1లో తలపడనున్నాయి. ఇందులో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోనుంది. మిగిలిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌ల ద్వారా ఫైనల్ రేసులో కొనసాగేందుకు ప్రయత్నించనున్నాయి. మూడు జట్లు సమాన పాయింట్లతో లీగ్ దశను ముగించడం ఐపీఎల్ చరిత్రలో అరుదైన సంఘటనగా మారింది. దీంతో రాబోయే ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు మరింత ఉత్కంఠభరితంగా ఉండనున్నాయని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: SRH vs RCB | IPL 2026: హైదరాబాద్ భారీ లక్ష్యం.. పవర్‌ప్లేలోనే ఆర్సీబీ కీలక వికెట్లు డౌన్!


