Cabinet Expansion | కేంద్ర మంత్రి పదవి దక్కేదెవరికి..? పొలిటికల్ సర్కిల్ లో జోరుగా చర్చ!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cabinet Expansion | కేంద్ర మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగనున్నట్లు సమాచారం. మోదీ మూడో సారి ప్రధానిగా 2024 జూన్​ 9న ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ (BJP) అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతుండటంతో మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా తెలంగాణకు మరో మంత్రి పదవి దక్కనున్నట్లు తెలిసింది.

తెలంగాణ (Telangana)లో అధికారంలోకి రావాలని బీజేపీ యత్నిస్తోంది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత రాష్ట్రంలోనే బీజేపీ బలంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే సీట్లు సాధించిన కమలం పార్టీ, పార్లమెంట్​ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకొని 8 ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఇటీవల బెంగాల్​, అస్సాం, పుదుచ్చేరిలో విజయం తర్వాత ప్రధాని మోదీ హైదరాబాద్​లో పర్యటించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సర్కార్​ వస్తుందని చెప్పారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రివర్గంలో మరొకరికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.

Cabinet Expansion | బీసీలకు..

ప్రస్తుతం తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. రాష్ట్రానికి చెందిన కె లక్ష్మణ్ ఉత్తర ప్రదేశ్​ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. దీంతో మొత్తం 9 మంది ఎంపీలు ఉండగా.. ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నారు. అందులో కిషన్​రెడ్డి రెడ్డి సామాజిక వర్గం కాగా, బండి సంజయ్​ బీసీ (మున్నూరు కాపు) కులానికి చెందిన వారు. ప్రస్తుతం ఉన్న ఎంపీల్లో బీసీలు ఎక్కువగా ఉండటంతో మరో మంత్రి పదవి వారికే ఇవ్వనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులను అలాగే కొనసాగించాలని బీజేపీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం.

Cabinet Expansion | రేసులో ఉన్నది వీరే

కేంద్ర మంత్రి పదవి రేసులో ఎంపీలు ఈటల రాజేందర్​ (Eatala Rajender) (ముదిరాజ్​), ధర్మపురి అర్వింద్​ (Dharmapuri Arvind) (మున్నూరు కాపు) ఉన్నారు. రాష్ట్రంలో కులాల వారీగా చూస్తే ముదిరాజ్​లో అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఈటల రాజేందర్​కు మంత్రి పదవి ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సీనియర్​ నేత కావడం, అనుభవం ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అర్వింద్​, కె లక్ష్మణ్​ సైతం మంత్రి పదవి ఆశిస్తున్నారు. వీరిద్దరు మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన వారు. ఇప్పటికే ఆ కులానికి చెందిన బండి సంజయ్​ మంత్రివర్గంలో ఉన్నారు. దీంతో వీరికి అవకాశం వస్తుందా.. లేక ఈటలకు పదవి ఇస్తారా అనేది త్వరలో తెలియనుంది.

Cabinet Expansion | శాఖల్లో మార్పు

ప్రస్తుతం రాష్ట్రం నుంచి బండి సంజయ్​ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. కిషన్​ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. వీరి పదవులను తొలగించకుండా.. శాఖల్లో మార్పు చేయనున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యంలో ఆశావహులు కేంద్ర నాయకత్వం వద్ద తమ ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేలా బీజేపీ పెద్దలు బలమైన నేతకు పదవి ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్​ టాపిక్​గా మారింది.

ఇది కూడా చదవండి..: Chinthala Pati Madhu | మూడు ముక్కలుగా నరికి.. గోనె సంచిలో కుక్కి .. బీఆర్ఎస్ నాయకుడి దారుణ హత్య!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *