Somireddy Comments | జగన్ వ్యాఖ్యలపై సోమిరెడ్డి ఫైర్.. 17 ఏళ్ల తర్వాత అనుమానాలా..?

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Somireddy Comments | వైఎస్ రాజశేఖరరెడ్డి (Y.S. Rajasekhara Reddy) మరణంపై ఇటీవల రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసిన అంశాలపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ఘాటుగా స్పందించారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి, రాజ‌శేఖ‌ర్ రెడ్డి మరణంపై 17 సంవత్సరాల తర్వాత అనుమానాలు వ్యక్తం చేయడం రాజకీయంగా విచిత్రంగా ఉందని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న సమయంలో ఈ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు.

Somireddy Comments | వేడెక్కిన రాజ‌కీయం..

వైఎస్ మరణం జరిగిన సమయంలో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయని సోమిరెడ్డి గుర్తు చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu)పై ఇప్పుడు ఆరోపణలు చేయడం విచిత్రంగా ఉంద‌ని అన్నారు. అంతేకాకుండా ఆ ఘటనపై అప్పట్లో సీబీఐ విచారణ జరిగిందని, అది ప్రమాదమేనని దర్యాప్తు సంస్థ తేల్చిందని పేర్కొన్నారు. ఆ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని జగన్ ఇప్పుడు ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావడంపై ఆయన విమర్శలు గుప్పించారు.

Somireddy Comments | మరోసారి మాటల యుద్ధం

ఇదే సందర్భంలో కడపకు చెందిన పార్థసారథి రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించిన సోమిరెడ్డి, వైఎస్ కుటుంబంపై గతంలో వచ్చిన వివాదాలను గుర్తుచేశారు. చంద్రబాబుకు ఫ్యాక్షన్ నేపథ్యం లేదా నేర చరిత్ర లేదని, అలాంటి ఆరోపణలు చేసే ముందు విషయాలను గుర్తుంచుకోవాలని సూచించారు.అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి మ‌ర్డ‌ర్ కేసు అంశాన్ని ప్రస్తావిస్తూ, సొంత కుటుంబానికి సంబంధించిన కేసులోనూ నిందితులను గుర్తించలేకపోయారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. వైఎస్ మరణం అంశంపై రాజకీయ నేతల మధ్య పరస్పర విమర్శలు మరింత చర్చనీయాంశంగా మారుతున్నాయి.

ఇది కూడా చదవండి..: Delimitation Debate | డీలిమిటేషన్‌పై రాజకీయ వేడి.. చిదంబరం-లోకేష్ మధ్య మాటల యుద్ధం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *