అక్షరటుడే వెబ్‌డెస్క్: ITC Hotels Sanjay Dubri | ప్రముఖ హోటల్ రంగ దిగ్గజమైన ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ (ITC Hotels Limited).. మధ్యప్రదేశ్‌లోని ( Madhya Pradesh ) ప్రసిద్ధ సంజయ్ దుబ్రి నేషనల్ పార్క్ సమీపంలో ‘స్టోరీ బై ఐటీసీ హోటల్స్, సంజయ్ దుబ్రి’ పేరుతో ఒక కొత్త బోటిక్ రిసార్ట్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన మేనేజ్మెంట్ కాంట్రాక్ట్‌ను తాజాగా ఖరారు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. సిద్ధి జిల్లాలోని అడవి అందాల నడుమ రూపుదిద్దుకోనున్న ఈ రిసార్ట్‌లో మొత్తం 30 గదులు (కీస్) అందుబాటులో ఉండనున్నాయి.
ITC Hotels Sanjay Dubri | వాతావరణానికి తగినట్లుగా ..
ఈ రిసార్ట్‌ను ప్రకృతికి ఎలాంటి భంగం కలగకుండా అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో విశాలమైన విల్లాలు, సూట్లతో పాటు పర్యాటక ప్రాంత సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రత్యేక వసతులు ఉండనున్నాయి. ఇక్కడకు వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన భోజన వసతులు, విశ్రాంతి స్థలాలు, వైల్డ్‌లైఫ్ సఫారీ, నేచర్ వాక్, వెల్నెస్ వంటి విభిన్న అనుభవాలను అందించనున్నారు.
ITC Hotels Sanjay Dubri | పర్యాటకానికి ప్రోత్సాహం..
ఈ సందర్భంగా ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ చద్దా మాట్లాడుతూ.. భారతదేశంలోని విభిన్న ప్రకృతి దృశ్యాలు పర్యాటక రంగానికి కొత్త అవకాశాలను తెస్తున్నాయని, ముఖ్యంగా వన్యప్రాణి పర్యాటక ప్రాంతాలకు పర్యాకుల నుంచి ఆదరణ పెరుగుతోందని తెలిపారు. సంజయ్ దుబ్రి ప్రాంతం గొప్ప పర్యావరణ వారసత్వాన్ని కలిగి ఉందని, ఇక్కడ అద్భుతమైన ఆతిథ్యాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
సాల్ అడవులు, పెద్దపులుల సంచారానికి ప్రసిద్ధి చెందిన సంజయ్ దుబ్రి నేషనల్ పార్క్.. మధ్య భారతదేశంలో ప్రముఖ వైల్డ్‌లైఫ్ డెస్టినేషన్‌గా ఎదుగుతోంది. బంద్ఘర్, కన్హా వంటి ఇతర ప్రముఖ అడవులకు దగ్గరగా ఉండటం, ప్రయాగ్‌రాజ్, జబల్పూర్, వారణాసి వంటి నగరాల నుంచి రోడ్డు మార్గం మెరుగుపడటంతో ఇక్కడకు టూరిస్టుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది.
ITC Hotels Sanjay Dubri | ఐటీసీ హోటల్స్ ప్రస్థానం..
1975లో ప్రారంభమైన ఐటీసీ హోటల్స్.. ప్రస్తుతం భారత్, శ్రీలంక, నేపాల్ దేశాలలో 155కి పైగా హోటళ్లు, 14,200లకు పైగా గదులతో దేశంలోని అతిపెద్ద, అత్యంత గౌరవప్రదమైన ఆతిథ్య రంగ సంస్థలలో ఒకటిగా నిలిచింది. పర్యావరణ పరిరక్షణలో ముందుండే ఐటీసీ హోటల్స్.. ప్రపంచంలోనే అత్యధికంగా LEED ప్లాటినం సర్టిఫైడ్ హోటళ్లను కలిగిన చైన్‌గా గుర్తింపు పొందింది. లగ్జరీ నుంచి ప్రీమియం బోటిక్ (స్టోరీ), హెరిటేజ్ విభాగాల వరకు వివిధ బ్రాండ్ల ద్వారా ఐటీసీ తన సేవలను విస్తరిస్తోంది.
ఇది కూడా చదవండి: BC Commission Visit | 7న నిజామాబాద్‌కు బీసీ కమిషన్.. వీడీసీల బహిష్కరణలపై సమావేశం