అక్షరటుడే వెబ్‌డెస్క్: Nara Lokesh Strategy Meeting | రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముందు విద్యుత్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ( Nara Lokesh )మంత్రులతో ప్రత్యేకంగా బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. ఎన్నికలు నిర్దేశిత సమయానికే జరుగుతాయని స్పష్టం చేసిన ఆయన.. ఇప్పట్నుంచే సన్నద్ధం కావాలని మంత్రులకు పిలుపునిచ్చారు.
Nara Lokesh Strategy Meeting | ఇంటింటి ప్రచారానికి పక్కా స్కెచ్..
స్థానిక పోరులో కూటమి అభ్యర్థులే భారీ మెజారిటీ సాధించేలా క్షేత్రస్థాయి ప్రచారంపై లోకేశ్ ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలు, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెట్టిన తీరును ప్రజలకు వివరించాలని కోరారు. ప్రచారంలో భాగంగా నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటి వద్ద కనీసం 3 నిమిషాలు గడిపి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
Nara Lokesh Strategy Meeting |ప్రజా సమస్యల చర్చ..
ఇదే సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్-నినో పరిస్థితులను సభ ద్వారా ప్రజలకు వివరించాలని తెలిపారు. జలాశయాల్లోకి వరద నీరు చేరడం ఊరటనిచ్చే అంశమని పేర్కొంటూ.. ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత తాగునీటి సరఫరాకే ఇవ్వాలని, అలాగే పశుగ్రాస కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీని వేదికగా మలచుకుందామని నారా లోకేశ్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: KTR | ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు అన్యాయం: కేటీఆర్