అక్షరటుడే వెబ్‌డెస్క్: India Japan Air Exercise | భారత వైమానిక దళం (IAF), జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (JASDF) సంయుక్తంగా నిర్వహించే ద్వైపాక్షిక వాయుసేన విన్యాసాలు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ వేదికగా ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 9 నుంచి 22 వరకు రెండు వారాల పాటు ఈ విన్యాసాలు జరగనున్నట్లు ఐఏఎఫ్ అధికారికంగా వెల్లడించింది. ఈ రెండో విడత విన్యాసాల్లో పాల్గొనేందుకు జపాన్ వాయుసేన బృందం శనివారం భారత్‌కు చేరుకుంది. జపాన్‌కు చెందిన రెండు సి-2 సైనిక రవాణా విమానాలు జోధ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ల్యాండ్ కాగా, భారత వాయుసేన అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికారు.
India Japan Air Exercise | సామర్థ్యాల పెంపే లక్ష్యంగా..
ఈ సంయుక్త విన్యాసాల ద్వారా ఇరు దేశాల వైమానిక దళాల మధ్య కార్యాచరణ సమన్వయం, పరస్పర అవగాహన మరింత బలపడతాయని ఐఏఎఫ్ పేర్కొంది. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా కలిసి పనిచేసే ఇంటర్‌ఆపరేబిలిటీ సామర్థ్యాన్ని ఇవి పెంపొందిస్తాయని తెలిపింది. ఈ విన్యాసాల సందర్భంగా ఇరు దేశాల పైలట్లు అత్యాధునిక సాంకేతికతతో పాటు తమ వైమానిక వ్యూహాలను పరస్పరం పంచుకోనున్నారు.
వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ విన్యాసాలు.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతిభద్రతలను ప్రోత్సహించడంతో పాటు, భారత్-జపాన్ దేశాల మధ్య రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు దోహదపడనున్నాయి.
ఇది కూడా చదవండి: KRMB Orders | కేఆర్ఎంబీ ఆదేశాలు తెలంగాణకు గొడ్డలిపెట్టు : కేటీఆర్