అక్షరటుడే వెబ్‌డెస్క్: Ramesh Mhatre Bail | వైద్యులపై జరిగే దాడులను ఏమాత్రం సహించబోమని సుప్రీంకోర్టు ( Supreme Court ) మరోసారి తేల్చిచెప్పింది. మహారాష్ట్రలో వైద్యులు, సిబ్బందిపై దాడి చేసిన శివసేన (షిండే వర్గం) కార్పొరేటర్ రమేశ్ మాత్రేకు బాంబే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను అత్యున్నత న్యాయస్థానం సోమవారం రద్దు చేసింది. ఆయన తక్షణమే మూడు రోజుల్లోగా లొంగిపోవాలని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Ramesh Mhatre Bail | దాడి చేస్తే కఠిన సందేశం..
మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “వైద్యులు సమాజానికి ఎంతో సేవ చేస్తారు.. వారిపై దాడి చేయడం సరికాదు. వైద్య సిబ్బందిపై చేయి చేసుకుంటే చట్టం ఎంత కఠినంగా ఉంటుందనే బలమైన సందేశం సమాజానికి వెళ్లాలి” అని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాకుండా, మాత్రే దాడి చేసిన తర్వాత అదే పార్టీకి చెందిన మరో వర్గం కూడా ఇలాంటి దాడికే పాల్పడటాన్ని కోర్టు ప్రస్తావించింది.
Ramesh Mhatre Bail | 19 క్రిమినల్ కేసులు..
విచారణ సందర్భంగా నిందితుడు రమేశ్ మాత్రే తరఫు సీనియర్ న్యాయవాది వాదిస్తూ.. ఈ కేసులో ఇప్పటికే ట్రయల్ ప్రారంభమైందని, సాక్షుల విచారణ కొనసాగుతోందని తెలిపారు. అయితే, నిందితుడిపై మొత్తం 19 క్రిమినల్ కేసులు ఉన్నాయని ధర్మాసనం గుర్తుచేసింది. వాటన్నింటిపై స్పందిస్తూ.. అవన్నీ రాజకీయ కక్షసాధింపు కేసులేనని, వాటిలో 18 కేసుల్లో మాత్రే నిర్దోషిగా తేలారని లాయర్ వివరించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు సూచించిన విధంగా విచారణను వేగంగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Ramesh Mhatre Bail | అసలేం జరిగిందంటే..?
మహారాష్ట్ర థానే జిల్లాలోని శాస్త్రి నగర్ ఆస్పత్రిలో గర్భిణికి వైద్యం అందించడంలో ఆలస్యం జరిగిందంటూ జూలై 6న కుటుంబ సభ్యులు సిబ్బందితో గొడవపడ్డారు. ఆ తర్వాత శివసేన కార్పొరేటర్ రమేశ్ మాత్రే అక్కడికి చేరుకుని సహచరులతో కలిసి వైద్యులపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు కాగా.. బాంబే హైకోర్టు ఆగస్టు 7న అతనికి బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, న్యాయస్థానం బెయిల్ రద్దు చేస్తూ సరెండర్ కావాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: BJP Corporators Protest | మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ కార్పొరేటర్లు..