అక్షరటుడే, వెబ్డెస్క్ : KRMB Orders | కేఆర్ఎంబీ ఆదేశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని కేఆర్ఎంబీ ఆదేశాలు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమన్నారు.
ఎల్నినో పేరు చెప్పి కేఆర్ఎంబీ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని కేటీఆర్ అన్నారు. ఏ నిబంధనల ప్రకారం, ఏ హక్కుల ప్రకారం వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని తరలిస్తున్నారని ప్రశ్నించారు. ఏపీ దర్జాగా వెలిగొండకు సాగునీరు తరలిస్తుంటే, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పంపులు మూసుకుని సహకరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
KRMB Orders | అసమర్థ పాలన
ఏపీ ప్రభుత్వం ఆంధ్రా ప్రయోజనాల కోసం పనిచేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసిందని విమర్శించారు. అసమర్ధ పాలనతో రేవంత్ రెడ్డి శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లను ఏపీకి దారాధత్తం చేశారన్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు, కల్వకుర్తి ఎత్తిపోతల, జూరాల, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల పథకాల కింద రైతుల పొలాలను ఎండబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
KRMB Orders | 30 టీఎంసీలు మాయం
ఆగస్టు 21న శ్రీశైలం రిజర్వాయర్లో 169 టీఎంసీలు ఉంటే.. ప్రస్తుతం 139 టీఎంసీలకు పడిపోయాయన్నారు. 15 రోజుల్లో 30 టీఎంసీలు మాయం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జలాలను ఏపీ యథేచ్ఛగా తరలిస్తున్నా కాంగ్రెస్ సర్కారులో చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు.
దీనిని కూడా చదవండి : School Fee Regulation | ఫీజుల నియంత్రణ చట్టం ఎప్పుడు తెస్తారు : కవిత