అక్షరటుడే వెబ్‌డెస్క్: Etela Rajender | కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ వినియోగంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సాగుతున్న మాటల యుద్ధంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ( Etela Rajender ) ఘాటుగా స్పందించారు. రాజకీయ భేషజాలను పక్కన పెట్టి, సముద్రం పాలవుతున్న నీటిని పంట పొలాలకు మళ్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శ్యామాప్రసాద ముఖర్జీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
Etela Rajender | “ప్రతివిమర్శలు కాదు.. నీళ్లు కావాలి”..
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని ఈటల డిమాండ్ చేశారు. అయితే, ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్మించిందనే కక్షతో దానిని ఆపరేట్ చేయకపోవడం సరికాదన్నారు. “లక్ష క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తుంటే, మరోవైపు కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో విమర్శలు మానుకుని నీళ్లను పంపింగ్ చేయాలి. అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి పంప్ హౌస్‌లు పనిచేస్తున్నాయి, కన్నెపల్లి కెపాసిటీ ప్రకారం 25 వేల క్యూసెక్కులు వస్తే పంపింగ్ చేయవచ్చు. వర్షాలు లేక రైతులు విత్తనాలు వేయలేని పరిస్థితిలో ఉన్నారు, రేవంత్ రెడ్డి విశాల దృక్పథంతో ఆలోచించాలి” అని సూచించారు.
Etela Rajender | రేవంత్ తీరుపై విమర్శలు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈటల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “అమెరికాలో అబద్ధాలు చెబితేనే ప్రజలు ఇష్టపడతారని రేవంత్ నమ్ముతున్నారు. హైడ్రాను హిట్లర్ నుండి తీసుకున్నానని స్వయంగా ఆయనే చెప్పడం ఆయన నైజానికి నిదర్శనం. పేదవారి ఇళ్లను కూలగొట్టడం, వారు నివసించే స్థలాలను లాక్కోవడం రేవంత్ ఎజెండా. హైడ్రాను మొదట్లో నేను ఒంటరిగా వ్యతిరేకిస్తే చాలామంది తప్పుబట్టారు, కానీ ఇప్పుడు కోర్టులే దాని నిజస్వరూపాన్ని బయటపెడుతున్నాయి. రంగనాథ్ వంటి అధికారులు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వ్యవహరిస్తున్నారు” అని మండిపడ్డారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా రేవంత్ ఓటమి ఖాయమని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైడ్రా వల్ల పార్టీ భారీ మూల్యం చెల్లించుకోబోతుందని జోస్యం చెప్పారు.
Etela Rajender | కేంద్రం సహకారంపై స్పష్టత..
రాష్ట్ర అభివృద్ధి విషయంలో బీజేపీకి ఎలాంటి పక్షపాతం లేదని ఈటల స్పష్టం చేశారు. మెట్రో విస్తరణకు (శామీర్ పేట, మేడ్చల్, ఎయిర్పోర్ట్, ఫోర్త్ సిటీ) తమ పార్టీ వ్యతిరేకం కాదని, కాకపోతే పద్ధతి ప్రకారం జరగాలని కోరారు. “మెట్రో ఫేజ్-1కు రూ. 13 వేల కోట్లు, ఫేజ్-2కు రూ. 40 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. మేము అడ్డుపడుతున్నామని వస్తున్న ప్రచారం అబద్ధం. ట్రిపుల్ ఆర్ (RRR) రోడ్డు ఇచ్చింది కూడా కేంద్రమే కదా? మెట్రో పనులను త్వరగా పూర్తి చేయడానికి బీజేపీ ఎంపీలుగా, మంత్రులుగా మేము పూర్తి సహకారం అందిస్తాం” అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Siro Pharma Plant | ఫార్మా రంగంలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు