Japan Earthquake | జపాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం.. 23 మందికి గాయాలు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Japan Earthquake | జపాన్‌ తూర్పు ప్రాంతాన్ని ఆదివారం తెల్లవారుజామున భూకంపం కుదిపేసింది. టోక్యో సహా పలు ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి.

ఈ ఘటనలో 23 మంది గాయపడగా.. ఎక్కువమందికి స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా రవాణా, విద్యుత్‌ సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడింది. సునామీ ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు.

జపాన్‌ వాతావరణ సంస్థ ప్రకారం దక్షిణ ఇబరాకి ప్రిఫెక్చర్‌ కేంద్రంగా భూకంపం సంభవించింది. భూమికి సుమారు 70 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రతను మొదట 5.9గా అంచనా వేశారు. అమెరికా జియోలాజికల్‌ సర్వే మాత్రం 5.8గా నమోదు చేసింది.

Japan Earthquake | నిద్రలో ఉండగా ఒక్కసారిగా ప్రకంపనలు

భూకంపం ప్రభావంతో సైతామా, కనగావా, చిబా, ఇబరాకి ప్రిఫెక్చర్లలో గాయపడినవారు ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వారిలో పలువురు ప్రకంపనలతో ఉలిక్కిపడి మంచం నుంచి లేవడానికి ప్రయత్నించే సమయంలో పడిపోవడం లేదా తలుపులు, ఫర్నిచర్‌ను ఢీకొనడంతో గాయపడ్డారు.

యోమియురి వార్తా సంస్థ కథనం ప్రకారం.. కనగావా ప్రిఫెక్చర్‌లోని యొకోహామాకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు మంచంపై నుంచి పడటంతో తుంటికి తీవ్ర గాయమైంది.

University of London | హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటుకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ సుముఖత

Japan Earthquake | రైళ్ల రాకపోకలకు అంతరాయం

భూకంపం కారణంగా టోక్యో, నరిటా విమానాశ్రయాన్ని కలిపే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో పాటు ఈశాన్య ప్రాంతాల్లోని కొన్ని స్థానిక రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయి. అయితే షింకాన్సెన్‌ బుల్లెట్‌ రైళ్ల సేవలు సాధారణంగానే కొనసాగినట్లు ఈస్ట్‌ జపాన్‌ రైల్వే వెల్లడించింది.

ప్రకంపనల సమయంలో మొబైల్‌ ఫోన్లకు అత్యవసర భూకంప హెచ్చరికలు కూడా వచ్చాయి. టోక్యోలో ప్రకంపనలు బలంగా అనిపించాయి. కొటో ప్రాంతంలో భూగర్భ నీటి పైప్‌లైన్‌ దెబ్బతినడంతో రోడ్డుపైకి నీరు వచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. అనంతరం పైప్‌లైన్‌ను మరమ్మతు చేసి నీటి లీకేజీని నిలిపివేశారు.

Japan Earthquake | వందల ఇళ్లకు విద్యుత్‌ అంతరాయం

భూకంపం కారణంగా టోక్యోలో సుమారు 460 ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినట్లు TEPCO పవర్‌ గ్రిడ్‌ తెలిపింది. అయితే ఆదివారం ఉదయం నాటికి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించినట్లు వెల్లడించింది.

అణు విద్యుత్‌ కేంద్రాలపై కూడా అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. దేశంలోని దాదాపు డజను అణు విద్యుత్‌ కేంద్రాలు, అణు పదార్థాల నిర్వహణకు సంబంధించిన ఇతర కేంద్రాల్లో ఎలాంటి అసాధారణ పరిస్థితులు గుర్తించలేదని న్యూక్లియర్‌ రెగ్యులేషన్‌ అథారిటీ తెలిపింది.

Japan Earthquake | నష్టంపై ప్రభుత్వ అంచనా

భూకంపం అనంతరం నష్టాన్ని అంచనా వేసేందుకు జపాన్‌ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని సనాయే టకాయిచి తెలిపారు. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం ప్రాణనష్టం సంభవించలేదు. రవాణా, విద్యుత్‌, నీటి సరఫరాపై పరిమిత ప్రభావమే కనిపించింది.

ఇటీవల జపాన్‌లోని క్యూషూ ప్రాంతంలో 7.1 తీవ్రతతో మరో భారీ భూకంపం సంభవించింది. ఆ ఘటనలో 38 మంది మరణించగా, 364 మంది గాయపడ్డారు. 1,500కు పైగా భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాదాపు 20 వేల భవనాలు దెబ్బతిన్నాయి.

తాజా భూకంపం నేపథ్యంలో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం సునామీ ముప్పు లేదని స్పష్టం చేయడంతో పాటు అణు కేంద్రాల్లోనూ ఎలాంటి సమస్యలు లేవని వెల్లడించారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *