Karimnagar Paddy Procurement|వారంలోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావాలి: పొన్నం ప్రభాకర్

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Karimnagar Paddy Procurement|కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి, రాబోయే వారం రోజుల్లోగా ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులు, రైస్ మిల్లర్లు, లారీ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ఆయన ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

Karimnagar Paddy Procurement|కొనుగోళ్ల ప్రస్తుత పరిస్థితి ..

కరీంనగర్ జిల్లాలో ఈ సీజన్‌కు గాను 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయగా, ఇప్పటికే జిల్లాలోని 314 కొనుగోలు కేంద్రాలకు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చేసింది. ఇప్పటివరకు 1.58 lakh మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన కొనుగోళ్లు పూర్తయ్యాయి. మిగిలిన 1.5 lakh మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన సేకరించాలని మంత్రి సూచించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యానికి సంబంధించి 63% మేర (రూ. 237.39 కోట్లు) నిధులను బ్యాంకుల ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు.

Karimnagar Paddy Procurement|రవాణా ఇబ్బందులపై కీలక ఆదేశాలు..

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ, మిల్లుల వద్ద అన్‌లోడింగ్‌లోనూ ఎదురవుతున్న ప్రధాన సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. మిల్లుల వద్ద బీహార్ హమాలీలపైనే ఆధారపడటం వల్ల సమస్యలు వస్తున్నాయని, గ్రామాల్లో లోకల్ హమాలీలను వాడుకునేలా ఐకేపీ (IKP) ఇన్‌ఛార్జ్‌లు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. మిల్లుల వద్ద లారీలు రెండు రోజుల పాటు ఆగిపోవడం వల్లే రవాణా సమస్య వస్తోందని, ఒకే రోజులో అన్‌లోడింగ్ పూర్తి చేసి లారీలను ఎప్పటికప్పుడు పంపాలని మిల్లర్లను ఆదేశించారు. అవసరమైతే అదనపు హమాలీలను పెట్టుకోవాలన్నారు. ధాన్యానికి అనుగుణంగా లారీల సంఖ్యను పెంచాలని, అవసరమైతే రోడ్లపై ఎక్కడ లారీలు కనిపించినా వాటిని ధాన్యం తరలింపునకు ఉపయోగించుకునేలా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

Karimnagar Paddy Procurement|ఐకేపీ కేంద్రాలకు ప్రాధాన్యత..

సహకార సంఘాల (PACS) కేంద్రాల్లో సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని, అందుకే మహిళా సెంటర్లను ప్రోత్సహించేలా ఐకేపీకి బాధ్యతలు ఇస్తే సమస్యలు రావన్నారు. జిల్లా అవసరాలకు తగ్గట్టుగా రైతులు సన్న ధాన్యం పండించేలా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. పొరుగున ఉన్న సిద్దిపేట జిల్లాలో 1.5 lakh మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరం కాగా.. కేవలం 70,000 మెట్రిక్ టన్నులు మాత్రమే స్థానికంగా వస్తోందని, కరీంనగర్‌లో అలాంటి పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు.

Karimnagar Paddy Procurement|సమన్వయంతో పనిచేయాలి..

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖల అధికారులు (రెవెన్యూ, పోలీస్, రవాణా, సివిల్ సప్లైస్, డీఆర్డీఏ, మెప్మా) సమన్వయంతో పని చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

ఈ సమీక్షా సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, హుస్నాబాద్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం , రైస్ మిల్లర్లు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Bandi Bhagirath Case | కవిత జైలుకెళ్తే కేసీఆర్ రాజీనామా చేశారా? : రామచందర్ రావు

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *